ఇదా మీ నిర్వాకం? | developed districts in the straits | Sakshi
Sakshi News home page

ఇదా మీ నిర్వాకం?

Jul 24 2014 2:37 AM | Updated on Jun 1 2018 8:52 PM

‘పరిశ్రమలన్నీ అభివృద్ధి చెందిన జిల్లాలకు తరలిపోతున్నాయి. రాజధాని మొదలుకొని ఐటీ పరిశ్రమల వరకూ విజయవాడ, గుంటూరు తదితర జిల్లాల్లో నెలకొల్పుతున్నారు.

 అనంతపురం టౌన్ : ‘పరిశ్రమలన్నీ అభివృద్ధి చెందిన జిల్లాలకు తరలిపోతున్నాయి. రాజధాని మొదలుకొని ఐటీ పరిశ్రమల వరకూ విజయవాడ, గుంటూరు తదితర జిల్లాల్లో నెలకొల్పుతున్నారు. కళ్లముందే పరిశ్రమలు తరలిపోతాంటే మీరేం చేస్తున్నా’రని జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులను అఖిలపక్ష నాయకులు నిలదీశారు. ప్రభుత్వానికి 12 మంది ఎమ్మెల్యేలను అందించిన జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఉండే చిత్తశుద్ది ఇదేనా అని ప్రశ్నించారు.
 
 అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చిన నగరం బంద్ కార్యక్రమాన్ని విరమింపజేసేందుకు బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఇన్‌చార్జ్ సీఎం రమేష్, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, పార్టీ అధ్యక్షులు బీకే పార్థసారథి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
 
  ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లా అభివృద్ధిపై నోరు మెదకపకపోవడం బాధకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్థలన్నీ కోస్తాంధ్రకు తరలిపోతున్నాయని అన్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు అభివృద్ధి చెందిన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయా ప్రాంతాల మంత్రులు ప్రకటించారని తెలిపారు. కానీ జిల్లా మంత్రులు మాత్రం ఇంత వరకు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
 
  పరిశ్రమలన్నీ తరలిపోయిన తర్వాత ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని నిలదీశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ... జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌ను తీసుకురావాలన్నారు. అనంత కాకపోయినా రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న గుంతకల్లు డివిజన్‌ను రైల్వే జోన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ఐఐటీ, నిట్, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి వాటిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు రమణ మాట్లాడుతూ... జిల్లాకు 100 టీఎంసీల నీటిని తీసుకువస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. నీరు ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చ రిత్రలో ఒక టీఎంసీ కూడా జిల్లా కోసం తీసుకువచ్చిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ఈ సారైనా ఎంత నీటిని తీసుకొస్తారో స్పష్టం చేయాలన్నారు. హంద్రీనీవాను పూర్తి చేయగలిగితే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు. సాగునీటిని తీసుకురావడానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు. సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి పెద్దన్న, అనంత అభివృద్ధి సాధన కమిటీ నాయకులు వీకే రంగారెడ్డి మాట్లాడుతూ... ప్రజల ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వంపై రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతోందని విమర్శించారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. జిల్లా అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు.
 
 సీఎం వరాలు కురిపిస్తారు..
 గురు,శుక్రవారాల్లో జిల్లా పర్యటన సందర్బంగా ముఖ్యమంత్రి ఈ జిల్లాకు వరాలు కురిపిస్తాడని మంత్రులు పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత, జిల్లా ఇన్‌చార్జ్ సీఎం రమేష్‌లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోనే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
 
  ఈ జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ, పుట్టపర్తిలో విమాన మరమ్మతుల పరిశ్రమ, జిల్లా కేంద్రంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రెండో దశ పనులను పూర్తి చేసేందుకు రూ.250 కోట్లు తదితర అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తారన్నారు. రాష్ట్రంలో రాజధాని, ఉప రాజధాని, పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాల గురించి సీఎం ఎక్కడా ప్రస్తావన చేయలేదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం అఖిలపక్షం నేతలతో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల హామీలతో సంతృప్తి పొందిన నేతలు గురువారం తలపెట్టిన నగరం బంద్ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు.
 
  బంద్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సీపీ ఐ జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జాఫర్, లింగమయ్య, రాజారెడ్డి, సీపీఐఎంల్ న్యూడెమొుక్రసీ నాయకులు వీరనారప్ప, లోకసత్తా నాయకులు ఇస్మాయిల్, జేఎస్పీ నాయకులు చార్లెస్ చిరంజీవిరెడ్డి, అనంత అభివృద్ధి సాధన కమిటీ నాయకులు  కేవీరమణ, దస్తగిరి, ఎస్‌యూసీఐ నాయకులు అమరనాథ్ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement