విద్యార్థులకు వీడియో పాఠాలు

Department of Education instruction for teachers - Sakshi

ఉపాధ్యాయులకు విద్యా శాఖ సూచన

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్, ఇతర కారణాలతో  విద్యార్థులు ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనేక వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తోంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ వేదికల ద్వారా తమ అభ్యసన కార్యక్రమాలను కొనసాగించేలా విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ద్వారా వీటిని అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలకు ఎస్‌సీఈఆర్‌టీ శ్రీకారం చుట్టింది. 

► వివిధ తరగతుల పాఠ్యాంశాల బోధనపై ఎస్‌సీఈఆర్‌టీ వీడియోలను తయారుచేయిస్తోంది. 
► సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా వీడియో పాఠ్యాంశాలు రూపొందించనుంది.
► ఈ వీడియో పాఠ్యాంశాలను విద్యాశాఖ ఏర్పాటుచేసే గూగుల్‌ లింక్‌కు యాడ్‌ చేస్తారు.
► ఉపాధ్యాయులు తమ ఫోన్ల ద్వారా కూడా పాఠాలు చెప్పి వాటిని ఎడిట్‌ చేసి పంపించవచ్చు.
► 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఇటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
► ఆసక్తి ఉన్న టీచర్లకు  మార్గదర్శనం చేస్తున్నారు.
► దీనివల్ల పిల్లలు పాఠశాలలకు రాలేకపోయినా వీడియో పాఠాల ద్వారా అంశాలను నేర్చుకోగలుగుతారు.

‘టెన్త్‌ విద్యార్థులకు వాట్సప్‌ ద్వారా పరీక్షలకు సన్నద్ధత’
► ప్రస్తుతం టెన్త్‌ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పాఠశాలల్లో విద్యార్థులను వాట్సప్‌ గ్రూపులుగా ఏర్పాటుచేశారు. ప్రతి సబ్జెక్టు టీచర్‌ ఈ గ్రూపులో ఉంటారు.
► గతంలోని పబ్లిక్‌ పరీక్షల మోడల్‌ పేపర్లను ఈ వాట్సప్‌ గ్రూపుల్లో పంపిస్తున్నారు.
► మరుసటి రోజు దూరదర్శన్‌లో ఆ మోడల్‌ పేపర్లలోని ప్రశ్నలను నిపుణులతో చెప్పించడంతోపాటు ప్రశ్నలను అర్థంచేసుకొని సమాధానాలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు.
► దూరదర్శన్‌ ఉదయం సెషన్లో ప్రశ్నలు చెప్పడంతో పాటు వాటికి పిల్లలతో హోమ్‌వర్కు చేయించడానికి కొన్ని అంశాలను ఇస్తారు. 
► మధ్యాహ్నం రెండో సెషన్లో ఉదయం మోడల్‌ పేపర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాశారు. తప్పులు ఎక్కడ ఉన్నాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో రివ్యూ చేయిస్తారు.
► టీచర్లకు తల్లిదండ్రులకు కూడా ఈ కార్యక్రమం వల్ల కొంత బాధ్యత పెరుగుతుంది. ఎస్‌సీఈఆర్‌టీ నుంచి వచ్చే మోడల్‌ పేపర్‌ను ఆ సబ్జెక్టు చూసే టీచర్‌ వాట్సప్‌ గ్రూపులోని పిల్లలకు పంపిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top