విజయవాడలో అధిక వడ్డీకి అప్పులిచ్చే ముసుగులో మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపిన దురాగతాలకు పాల్పడిన వారిపై చంద్రబాబు సర్కారు కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు మసిపూసే ప్రయత్నం చేస్తోందని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.
* కాల్‌మనీపై చంద్రబాబుకు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ సవాల్
* గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన సీపీఐ నేతలు
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో అధిక వడ్డీకి అప్పులిచ్చే ముసుగులో మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపిన దురాగతాలకు పాల్పడిన వారిపై చంద్రబాబు సర్కారు కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు మసిపూసే ప్రయత్నం చేస్తోందని సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌తో కలిసి గురువారం ఆయన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి విజయవాడ ఘటన, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయాలపై వినతిపత్రం అందజేశారు.
అనంతరం శాసనమండలి మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశం తర్వాత సీపీఐ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ నేతలు కూడా కాల్‌మనీ ఘటనలలో భాగస్వామ్యులను చేసేలా ప్రభుత్వం ప్రత్యారోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. విజయవాడ ఘటనల్లో తమ పార్టీ నేతలెవరికైనా భాగస్వామ్యముంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాల్‌మనీలో భాగస్వామ్యం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని రామకృష్ణ సవాల్ విసిరారు.