దేశం ముందుకెళ్తోంది | Country to move towards | Sakshi
Sakshi News home page

దేశం ముందుకెళ్తోంది

Sep 5 2016 1:13 AM | Updated on Sep 4 2017 12:18 PM

దేశం ముందుకెళ్తోంది

దేశం ముందుకెళ్తోంది

గ్రామాలు బాగుపడకుంటే స్మార్ట్ సిటీలకు అర్థం లేదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు.

స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో స్పీకర్ సుమిత్రా మహాజన్

 నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గ్రామాలు బాగుపడకుంటే స్మార్ట్ సిటీలకు అర్థం లేదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి నినాదాలతో దేశం ముందుకెళ్తోందని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న శిక్షణ, వైద్య సేవలు మినీభారత్‌ను తలపిస్తున్నాయన్నారు. ఇలాంటి ట్రస్ట్‌లు దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తే ఆనందమని, స్వలాభాపేక్ష లేకుండా సొంతంగా సేవలందిస్తే మహదానందమన్నారు.

పదవులు శాశ్వతం కాదని, సామాజిక సేవలో అసలైన ఆనందం ఉందని తెలిపారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, సొంత ఊరిని, దేశాన్ని, గురువులను విస్మరించినవాడు మనిషే కాదని వ్యాఖ్యానించారు. తనను ఈ స్థాయికి తెచ్చిన గురువులు సోంపల్లి సోమయ్య, దుర్గాప్రసాద్, పార్టీ, స్నేహితులకు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ... రాష్ట్రానికి ఇచ్చిన మూడు హామీలు హెచ్‌పీసీఎల్ రీఫైనరీ విస్తరణ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖపట్నంలో పెట్రోలియం ఎడ్యుకేషన్ యూనివర్సిటీ స్థాపన కోసం రూ.52 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. త్వరలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పి.వి.సింధు, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్, ఎంపీలు వరప్రసాద్‌రావు, గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, రక్షణశాఖ మంత్రి సలహాదారు సతీష్‌రెడ్డి, ట్రస్ట్ సభ్యులు ఆల్తూరి అశోక్, బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ ఆదిత్యరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement