చేపా చేపా.. ఎందుకివ్వవు.. | Corruption In Free Fish Distribution Chittoor | Sakshi
Sakshi News home page

చేపా చేపా.. ఎందుకివ్వవు..

Oct 30 2018 11:38 AM | Updated on Oct 30 2018 11:38 AM

Corruption In Free Fish Distribution Chittoor - Sakshi

చిత్తూరులో నిరుపయోగంగా ఉన్న మత్స్యశాఖ కార్యాలయ స్థలం

జిల్లా కేంద్రంలో ఓ స్థలం. చిత్తూరు నడిబొడ్డున ఉన్న దాని ధర రూ.కోట్లు పలుకుతోంది. దీన్ని ఉచితంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కట్టబెట్టాలని స్థానిక టీడీపీ నేతలు పట్టుబట్టారు.     చేపల పెంపకం.. మత్స్యశాఖ పరిపాలనకు సంబంధించి 1.20 ఎకరాల స్థలం ప్రస్తుతం టీడీపీ నేతల వలలో చిక్కుకుంది. చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న వాస్తవం.

చిత్తూరు అర్బన్‌: చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండు పక్కన.. రైల్వే గూడ్సుషెడ్డును ఆనుకుని మత్స్యశాఖకు చెందిన సర్వేనెంబరు 1/1బీ3లో 1.20 ఎకరాల స్థలం ఉంది. చేప పిల్లల పెంపకానికి సంబంధించి పది కుంటలతో పాటు మత్స్యశాఖ పరిపాలన భవనం కూడా ఇక్కడే ఉండేది. 2011లో కురిసిన భారీ వర్షాలకు మత్స్యశాఖ భవనం పూర్తిగా నేలమట్టమైంది. దీంతో తాత్కాలిక భవనాన్ని పాత కలెక్టరేట్‌కు మార్పు చేశారు. ఇంతటితో నగర నడిబొడ్డున మత్స్యశాఖ కార్యాలయ స్థలాన్ని అందరూ మరచిపోయారు. 2013లో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో మత్స్యశాఖ భవనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.  స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారనే పుకార్లు వచ్చాయి. కొద్ది రోజుల పాటు స్థలాన్ని చూసుకోవడానికి ఆ శాఖ అధికారులు ఇక్కడ కాపలాదారుడిని నియమించారు. కాలక్రమేణా అతన్ని విధుల నుంచి తప్పించారు. తరువాత రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. నిత్యం ఇటువైపు తిరుగుతున్న టీడీపీ నేతల కన్ను ఈ స్థలంపై పడింది. ఎలాగైనా దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తీసేసుకోవాలని పావులు కదిపారు.
రూ.20 కోట్లకు పైనే...

చిత్తూరు ఆర్టీసీ బస్టాండు వద్ద ఒక్క చదరపు అడుగు స్థలం రూ. 5 వేలు పలుకుతోంది. ఈ లెక్కన 1.20 ఎకరాలున్న మత్స్యశాఖ స్థలం దాదాపు రూ.20 కోట్లకు పైనే పలుకుతుంది. దీన్ని వీలైనంత వరకు ఎలాంటి నగదు చెల్లించకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి టీడీపీ కార్యాలయానికి ఉంచేసుకోవాలని చిత్తూరుకు చెందిన అధికారపార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మునిసిపల్‌ కార్పొరేషన్‌ సాధారణ సమావేశంలో  కార్యాలయ స్థలాన్ని టీడీపీ ఆఫీసుకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కలెక్టర్‌కు పంపాలని మునిసిపల్‌ అధికారులను నేతలు ఆదేశించారు. ఇప్పటికే చిత్తూరు నగరంలోని సీఎంటీ రోడ్డులో జిల్లా టీడీపీ కార్యాలయం ఉన్నా.. విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం పేరిట కొట్టేసి, సీఎం వద్ద మెప్పు పొందడానికే ఆ పార్టీ నేతలుఉత్సుకత చూపుతున్నారన్నది వాస్తవం.

కలెక్టర్‌ నిర్ణయమే..
మరోవైపు చిత్తూరులో మత్స్యశాఖ కార్యాలయ భవనం నిర్మించడంతో పాటు చేప పిల్లల పెంపక కుంటలు, మత్స్యకారులకు శిక్షణ ఇచ్చేందుకు సమావేశపు హాలు నిర్మించడానికి నిధులు విడుదలయ్యాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధుల (ఆర్‌డీఎఫ్‌) నుంచి రూ.1.50 కోట్లు విడుదలైతే భవనం ఎక్కడ నిర్మించాలో తెలి యక అధికారులు తల పట్టుకుంటున్నారు. టీడీపీ నేతల నుంచి వెళ్లిన ప్రతిపాదనలతో పాటు, మునిసిపల్‌ కార్పొరేషన్‌ తీర్మానం సైతం కలెక్టర్‌కు చేరింది. విలువైన స్థలాన్ని రాజకీయ పార్టీకి అప్పగించి విమర్శలు ఎదుర్కొంటారో..? గ్రామీణ ప్రాంతాల నుంచి రైళ్లలో, బస్సుల్లో చిత్తూరుకు వచ్చే రైతులకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో మత్స్యశాఖకే ఉంచుతారనే విషయం పూర్తిగా కలెక్టర్‌ నిర్ణయంపై ఆధారపడుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement