కార్పొరేటర్ల వినతులు పట్టించుకోని కమిషనర్‌

Commissioner Neglect On Corporaters Complaints krishna - Sakshi

కార్పొరేటర్ల వినతులు పట్టించుకోని కమిషనర్‌

అవినీతికి పాల్పడేది అధికారులేనంటూ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న మేయర్‌

అధికారులను వెనకేసుకొస్తూ కార్పొరేటర్లను పట్టించుకోవటం లేదంటూ మేయర్‌ ఆగ్రహం

మంత్రి ముందే కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయాలపై మేయర్‌ మండిపాటు

సాక్షి, అమరావతి బ్యూరో :   నిన్న మొన్నటి వరకు కమీషన్ల పితలాటకంలో వీధిన పడ్డ పాలకపక్ష కార్పొరేటర్లతో పాటు నగర మేయర్‌కు వీఎంసీలో చుక్కెదురవుతోంది.  అవినీతిపరులైన పాలకపక్ష కార్పొరేటర్ల వినతులను కమిషనర్‌ జె.నివాస్‌   ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం వారికి రుచించడం లేదు. దీంతో కమిషనర్‌ తీరుపై నిత్యం మంత్రులు, నగర అధికార పార్టీ నేతలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి పాత్రలో సూత్రధారులు పాలకపక్ష నేతలే కాదని,  అధికారులూ ఉన్నారంటూ వారు పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.   గతంలో అధికారుల అవినీతి, అక్రమాలు వెలుగులోకి వచ్చినా కమిషనర్‌ చర్యలు తీసుకోవడం లేదని, వారిని వెనకేసుకొస్తూ మమ్మల్ని మాత్రం పురుగుల్లా చూస్తున్నారంటూ భగ్గుమంటున్నారు.

మావారిది సరే..మీవారి అవినీతిపై చర్యలేవీ?..
వీఎంసీలో ప్రజాధనం దోచుకుతింటున్న అధికారులపై కమిషనర్‌ కొరడా ఝుళిపించకపోవడంపై నగర మేయర్‌ భగ్గుమంటున్నారు. తమ కార్పొరేటర్లపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారి వినతులను పట్టించుకోని కమిషనర్,  అధికారుల దందాలపై ఎందుకు స్పందించడం లేదంటూ పలుచోట్ల బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కుతున్నారు. వీఎంసీ ఇంటి దొంగల బండారం వెలుగులోకి తెచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా గత పుష్కరాల సందర్భంగా కొనుగోలు చేసిన పారిశుద్ధ్య పరికరాలు మాయం చేసిన విషయం నగర మేయర్‌ వెలుగులోకి తెచ్చారు. గత పుష్కరాల సమయంలో  మొత్తం రూ.3.75 కోట్ల విలువైన పరికరాలను కొనుగోలు చేస్తే అందులో రూ.1.75 కోట్ల విలువైన పరికరాలను ఓ ఉన్నత స్థాయి అధికారి ఆధ్వర్యంలో మాయం చేసి సొమ్ము చేసుకున్న వైనంపై ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు కమిషనర్‌ త్రిసభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించారు. అయితే  అక్రమాలు జరిగి చాలా రోజులయినా కమిషనర్‌ దృష్టికి రాకపోవడం ఏమిటంటూ పాలకపక్షం మండిపడుతోంది.

గతంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో జరిగిన అక్రమాలపై ఏసీబీ, శాఖాపరమైన విచారణలు జరిగి నిగ్గుతేల్చినా కమిషనర్‌ వారిపై చర్యలకు సిఫార్సు చేయకపోవడం, గతంలో హౌసింగ్‌ విభాగంలో సీడీఓలు, ఏఈ స్థాయి అధికారి కుమ్మక్కై లబ్ధిదారుల వాటా నగదు రూ.35 లక్షలు స్వాహా చేసిన వ్యవహారంలో కూడా సరైన చర్యలు చేపట్టకపోవడం, పుష్కరాల సందర్భంగా వేసిన రోడ్లలో అవినీతి చోటుచేసుకుందని ఏసీబీ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి కేసులు నమోదు చేసినా.. అనేక విషయాల్లో ఉద్యోగుల చేతివాటాపై కమిషనర్‌ స్పందించిన తీరు బాగాలేదని నగర మేయర్‌ శ్రీధర్‌ బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా హౌసింగ్‌లో జరిగిన అవినీతి వ్యవహారంపై మేయర్‌ బహిరంగ లేఖ రాయడం పెద్ద చర్చగా మారింది.   గతంలో నగరంలో ఏర్పాటు చేసిన గ్రీనరీ ప్లాంటేషన్‌లో నిధులు గోల్‌మాల్‌ జరిగినా చర్యలు శూన్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  వారం రోజుల క్రితం ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌లో జరిగిన మంత్రి కార్యక్రమంలో కమిషనర్‌ వ్యవహార శైలిపై తనకున్న అక్కసునంతా వెళ్లగక్కడం కలకలం రేపింది.

నలిగిపోతున్న అధికారులు..
వీఎంసీలో కమిషనర్‌ వర్సెస్‌ పాలకపక్షంగా మారడంతో అధికారలు, కింది స్థాయి ఉద్యోగులు నలిగిపోతున్నారు. వీఎంసీ బిగ్‌బాస్‌ కమిషనర్‌ చెప్పిందే అధికారులు చేస్తుండడంతో నగర మేయర్‌ వారిపై తరచూ మండిపడి బహిరంగంగానే తిట్ల దండకం అందుకుంటుండడంతో వారికి ఇబ్బందిగా మారుతోంది. ఇటీవల కేరళ వరద బాధితుల కోసం వీఎంసీ నుంచి పారిశుద్ధ్య పరికరాలు పంపించడం వివాదాస్పదంగా మారింది. తనకు తెలియకుండానే పరికరాలు ఎలా  పంపిస్తారంటూ మేయర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారిపై మండిపడ్డారు. తనకేం తెలియదని.. కమిషనర్‌ ఆదేశాల మేరకే పంపించామని చెప్పడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన సంఘటన కలకలం రేపింది. మేయర్‌ తరచూ కమిషనర్‌ అనుమతి లేకుండా శాఖాపరమైన సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం ఆయనకు నచ్చటం లేదు. ఇటీవల మేయర్‌ అధికారులతో సమీక్ష చేస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న కమిషనర్‌ తానే అధికారులతో సమీక్ష నిర్వహించడంపై మేయర్‌కు కోపం తెప్పించింది. దీంతో ఆయన కమిషనర్‌పై  బహిరంగంగానే తిట్ల దండకం అందుకోవడం గమనార్హం. మంత్రి నారాయణ అండతో కమిషనర్‌ తమను పట్టించుకోవడం లేదని మేయర్‌ మండిపడుతున్నారు. మొత్తం మీద వీఎంసీలో ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానలా      మారి అభివృద్ధికి ఆటంకంలా మారిందన్న   విమర్శలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top