చదువులో దూసుకెళ్తాం..

college students opinion on women empowerment - Sakshi

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళలు చదువుకుంటే కుటుంబమంతటికీ ప్రయోజనం చేకూరుతుంది. ఇంటిలో అన్ని వ్యవహారాలు సమర్థంగా చక్కదిద్దుకుంటుంది. సారథిగా ఇంటిని నడిపిస్తుంది..అందుకే ఈనానుడి.. ఆడపిల్లకు పెద్ద చదువులవసరం లేదు..కొద్దో గొప్పో చదివించి పెళ్లి చేస్తే పోతుందనే భావన ఎక్కువ మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వస్తోంది. ఆడపిల్లలు చదువుకుని రాణిస్తే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలరనే భావన ఏర్పడుతోంది. మహిళలు ఆర్థిక బలం పెంచుకుని ధైర్యవంతులుగా జీవితాన్ని సాగిస్తారని తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో సైతం వీరి శాతం పెరుగుతోంది. దూర ప్రాంత చదువులకు మగపిల్లల్ని పంపినట్టే ఆడపిల్లలనూ పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. తిరుపతిలో జరుగుతున్న అగ్రిఫెస్టుకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు వచ్చారు. వారిని ఇదే కోణంపై ‘సాక్షి’ ప్రశ్నించినప్పుడు వారంతా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువుల విషయంలో వివక్ష తగ్గిందని.. తల్లితండ్రుల్లో ఈమార్పు ఇంకా పెరగాలని వారంతా ఆకాంక్షించారు. వారేమంటున్నారో తెలుసుకుందాం. – యూనివర్సిటీ క్యాంపస్‌

జమ్మూలో తగ్గుతున్న వివక్ష
మా ప్రాంతంలో స్త్రీలపై వివక్ష  తగ్గింది. సాధారణంగా జమ్ముకాశ్మీర్‌ అంటే హింసాత్మక వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. విద్యాసంస్థల్లో, సమాజంలో మహిళల్లో వివక్ష తగ్గింది. దీనివల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. జమ్ముకాశ్మీర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్త్రీ,పురుషులకు సమాన అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు పరస్పరం సహకరించుకుంటున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యలో సమాన అవకాశాలు వస్తున్నాయి.  – మన్విత్‌ కౌర్, జమ్ము కాశ్మీర్‌

పూర్తి స్వేచ్ఛ ఉంది
వ్యవసాయ విద్యాలయంలో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాను. సాధారణంగా అమ్మాయిలంటేనే ఆంక్షలుంటాయి. అయితే గతంతో పోల్చితే పరిస్థితి మారింది. మా తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారు. దానివల్లే ఇలాంటి యువజనోత్సవాలకు వెళ్ళగలుగుతున్నాను. నాటితో పోల్చుకుంటే చాలా మార్పులు వచ్చాయి. సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు ఇందుకు దోహదపడుతున్నాయి..
–అనామిక శర్మ, జమ్మూ కాశ్మీర్‌

పరిస్థితులు మారాయి
మా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్ల చదువులో రాణిస్తున్నాను. పూర్వపు రోజుల్లో మహిళలకు విద్య ఎందుకు అన్న వివక్ష ఉండేది. ఆడపిల్లల్ని స్కూళ్లకు పంపేవారు కాదు. విద్య మహిళలకు అవసరం లేదనుకునేవారు. ఇప్పుడు ఆలోచనల్లో మార్పులొచ్చాయి. దీనివల్ల అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు. మేం పురుషులకు ఏమాత్రం తీసిపోము.     – గురుసేన్‌కౌర్,జమ్మూకాశ్మీర్‌

అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు పెరి గాయి. తల్లిదండ్రులు కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. కోరుకున్న చదువు, ఉద్యోగం తదితర అంశాల్లో స్వేచ్ఛ పెరిగింది. మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఎలాంటి వివక్షకు గురికాలేదు. వివక్ష నగరాల్లో పూర్తిగా తగ్గింది. ఇది మరింత విస్తృతం కావాల్సిన అవసరముంది. – హిధన్‌సీ అబ్రల్, జమ్మూకాశ్మీర్‌

స్త్రీలకు అనుకూల వాతావరణం
 నాన్న అంబుజా సిమెంట్‌ కంపెనీలో పనిచేస్తారు. కుటుంబంలో ముగ్గురం ఆడపిల్లలమే. అయినప్పటికీ అందరినీ చదివిస్తున్నారు. ఇటీవల కాలంలో  మహిళలకు పురుషులకన్నా అవకాశాలు పెరిగాయి. దీంతో స్త్రీలు గడప దాటి సమాజంలోకి వెల్లగలుగుతున్నారు. స్త్రీ రిజర్వేషన్‌ల వల్ల పురుషులకన్నా మహిళలకే అకాశాలు పెరిగాయి.      – జోషి ముద్ర, గుజరాత్‌

70 శాతం మంది అమ్మాయిలే
తమిళనాడులోని కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. యువజనోత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మా యూనివర్సిటీలో 70 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు.   భవిష్యత్తులో చదువుకునే అమ్మాయిల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాను. – మోషీనా, తమిళనాడు

కెరీర్‌పై దృష్టి పెట్టాలి
ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చదువుతున్నాను. మా తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం, నాన్న ప్రైవేటు ఉద్యోగి. ఇంట్లో నాపై ఎలాంటి వివక్ష లేదు. గత ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన యువజనోత్సవాల్లో పాల్గొన్నాను. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛ వల్లే వెళ్లగలుగుతున్నాను. కెరీర్‌పై దృష్టి పెట్టడం నేటి అమ్మాయిల ముందున్న కర్తవ్యమని భావిస్తున్నాను. –తేజశ్విని, కడప

 సమాన     అవకాశాలు
ఒకప్పుడు స్త్రీ విద్యపై వివక్ష ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దూర ప్రాంతాలకు పంపడమంటే రిస్కుగా తల్లి దండ్రులు భావించేవారు. ఆధునిక పరిస్థితుల ప్రభావం అందరిపై పడింది. మా నాన్న డాక్టర్‌. ఆడపిల్లలు చదువుకుంటే మంచిదన్న ఆలోచనతో ప్రోత్సహిస్తున్నారు. మా వర్సిటీలో స్త్రీ పురుషుల సంఖ్య సమానంగా ఉంటుంది. – నిధిసింగ్, రాంచి

ఇద్దరూఅమ్మాయిలమే...
మాది ఒంగోలు పొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చదువుతున్నాను. నాన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. మా తల్లిదండ్రులకు ఇద్దరం. మా ఇద్దరికి సమాన అవకాశాలు ఇచ్చారు. మా చెల్లి బీటెక్‌ చదువుతోంది, ఆడపిల్లలకు చదివిస్తున్నారు. విద్యవల్ల సమానత్వం వస్తుంది. ఈ విషయాన్ని మన రాష్ట్రంలో   గుర్తించినందుకే మహిళలు రాణిస్తున్నారు.   –రేష్మా, ఒంగోలు

మహిళలదే ఆధిక్యత
నేను తెలంగాణాలోని పీవీ నరసింహారావు వెటర్నరీ నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్‌ ఉద్యోగులు, నాతో పాటు అక్క, తమ్ముడు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు సమానంగా చదివిస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలను చదివిస్తే చాలనుకునేవారు.   ఇప్పుడు  మార్పు వచ్చింది. ఇప్పుడు పురుషుల కంటే మహిళలకే ఆధిక్యత పెరిగింది.– నివేదిత, తెలంగాణ

నలుగురూ ఆడపిల్లలమే
తండ్రి వ్యాపారం చేస్తా రు. అమ్మ గృహిణి. వారు పెద్దగా చదువుకోకపోయినా స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. మా కుటుంబంలో నలుగురమూ ఆడపిల్లలమే. అయినా అందరినీ చదివిస్తున్నారు. అమ్మాయిల చదువుపై కొన్నాళ్లు ఆంక్షలుండేవి. కేవలం కొద్దిపాటి చదువును చదివించి ఇంటికే పరిమితం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదని భావిస్తున్నాను. –నయిలా ప్రాజ్,  రాంచి

మొదటి సారి వచ్చాను
బాపట్లలో బీఎస్సీ అగ్రికల్చ ర్‌ చదువుతున్నా. నాన్న టీచర్, అమ్మ గహిణి. ఇంట్లో నేను, చెల్లి ఉంటాము.  ఈ యువజనోత్సవాలకు తొలి సారి వచ్చాను. వివిధ ప్రాంతాల వారితో మాట్లాడగలిగాను. యూనివర్సిటీల్లో అక్కడక్కడ వివక్ష ఉంటుందనుకుంటున్నా.    – అర్చన చౌదరి, బాపట్ల

పరిస్థితి మారింది
కోయంబత్తూరు వర్సిటీ నుం చి వచ్చాను. ఒకప్పుడు మహిళలకు చదువు ఎందుకనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది.  మా తల్లిదండ్రులకు ఇద్దరూ అమ్మాయిలమే. నాన్న ఫొటోగ్రాఫర్‌. ఇద్దరమ్మాయిలను సమానంగా చూస్తూ చదిస్తున్నారు.    – కార్తీక, తమిళనాడు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top