నిర్లక్ష్యాన్ని సహించబోం

Collector Satyanarayana Inspected High Schools In Anantapur Over Mid Day Meals Quality - Sakshi

బోధనలో నిర్లక్ష్యం వహించినా, మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోయినా సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాప్తాడులో ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బోధన విధానం బాగోలేదన్నారు. 

సాక్షి, రాప్తాడు : విద్యా బోధనలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం రాప్తాడు ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరుపట్టిక, మధ్యాహ్న భోజన వివరాలు పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. మరి కొంతమంది విద్యార్థులను సైన్సు, గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్టులలో ప్రశ్నలు అడగడంతో వారు కూడా చెప్పలేకపోయారు. ఉపాధ్యాయుల బోధన తీరు బాగలేదంటూ కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎవరు అశ్రద్ధ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ముఖ్యంగా విద్యార్థులకు ఉత్సుకత, ప్రేరణ కలిగించేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో ఆలోచన, పరిశీలనాశక్తి పెగిగేలా సైన్సు ఎగ్జిబిషన్‌లు, క్విజ్‌ పోటీలు, ప్రయోగాలు నిర్వహించేలా చూడాలని డీఈఓ శామ్యూల్‌కు సూచించారు. విద్యార్థులు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రీడీంగ్, రైటింగ్, కమ్యూనికేష్‌న్స్‌ స్కిల్స్‌లో ప్రావీణ్యత సాధించాలన్నారు.
 
భోజనం రుచిగా లేకపోతే చర్యలు  
మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. సాంబారులో ప్రతి 30 మందికి కేజీ చొప్పున ఆరు కేజీలు కంది పప్పు వాడాల్సి ఉండగా ఐదు కేజీలే వాడినట్లు తెలుసుకున్న కలెక్టర్‌ సదరు ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబారులో కూడా కాయగూరలు తక్కువగా ఉన్నాయన్నారు. మరొకసారి పాఠశాలను తనిఖీ చేస్తానని, ఆ రోజు ఇదే విధంగా మధ్యాహ్న భోజనం ఉంటే ఏజెన్సీని బాధ్యతల నుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం భోజనం ఉండేలా పర్యవేక్షించాలని హెచ్‌ఎం నరసింహులును ఆదేశించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ రామాంజనరెడ్డి పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top