టీడీపీలో కుమ్ములాటలు | Cold War Between TDP Party Leaders In Chittoor District | Sakshi
Sakshi News home page

టీడీపీలో కుమ్ములాటలు

Aug 14 2017 2:35 PM | Updated on Aug 10 2018 8:27 PM

టీడీపీలో కుమ్ములాటలు - Sakshi

టీడీపీలో కుమ్ములాటలు

జిల్లా టీడీపీలో అసంతృప్తి తీవ్రతరమైంది.

► మండల పార్టీ నేతల ప్రకటనతో భగ్గుమన్న విభేదాలు
► అసంతృప్తులకు బుజ్జగింపులు
► జన్మభూమి కమిటీల్లో చోటిస్తామని నాయకుల భరోసా

జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం పార్టీ మండలాధ్యక్షులను ప్రకటించడంతో మరింత పెరిగాయి. మండలాలకూ విభేదాల సెగ పాకింది. దీంతో పార్టీ అధిష్టానానికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్పడుతుండటం.. ఈ కమిటీల్లో జిల్లా స్థాయి నాయకుల అనుచరులు.. బంధువులే అధికంగా ఉండటాన్ని సామాన్య కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.  
 
చిత్తూరు, సాక్షి:  జిల్లా టీడీపీలో అసంతృప్తి తీవ్రతరమైంది. తాజాగా ప్రకటించిన మండలాధ్యక్ష పదవులలోనూ తమకు అన్యాయం చేశారని బీసీలు నిరసిస్తున్నారు. ఎక్కువ మండలాల్లో పార్టీ సారథ్యం సీఎం సామాజిక వర్గీయులకే కట్టబెట్టారని వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తమకు గుర్తింపే లేదని ఎస్సీ, ఎస్టీలు రగిలిపోతున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో కుతూహలమ్మ చెప్పినవారికి కాకుండా.. టీడీపీలో అన్నీతామై నడిపిస్తున్న ఓ సామాజికవర్గం చెప్పిన వారికి మండలాధ్యక్ష పదవులిచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ శివప్రసాద్‌ మాటకూ పార్టీలో విలువ లేదని ఎస్సీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్దికాలంగా పార్టీలో అసంతృప్తి పెరుగుతుండటం గమనించిన అధిష్ఠానం మండలాధ్యక్షుల ప్రకటనను రెండు నెలలు వాయిదా వేసింది. మదనపల్లి, శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు, తదితర నియోజకవర్గాల్లో మండలాధ్యక్షుల పదవుల కోసం రోడ్డుపైకొచ్చి ఘర్షణకు దిగిన సందర్భాలున్నాయి. అసంతృప్తులను బుజ్జగించి  శనివారం మండల పార్టీ నేతల పేర్లను ప్రకటించారు. అయినా  అసంతృప్తి పెల్లుబుకుతూనే ఉంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో భాగంగా కొత్తగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఇంతకుముందు కమిటీలో సర్పంచ్, ఎంపీపీ, నలుగురు పార్టీ నాయకులు ఉండేవారు. ఇప్పుడు సర్పంచ్‌లు ఇతర పార్టీ వారు ఉన్నచోట్ల వారిని తొలగించి టీడీపీ నాయకులకు ఈ కమిటీల్లో చోటుకల్పిస్తామని అధిష్ఠానం వారికి మాట ఇచ్చింది. 
 
మదనపల్లి టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది. రామదాస్‌చౌదరి, దొమ్మలపాటి రమేశ్, బొమ్మచెరువు శ్రీరాములు వర్గాలు నిత్యం తన్నుకుంటూనే ఉన్నాయి. మదనపల్లి మండలాధ్యక్ష పదవి తమకే ఇవ్వాలని బొమ్మచెరువు వర్గం డిమాండ్‌ చేస్తోంది. గొడవలు ముదరడంతో పాత అధ్యక్షుడు దొరస్వామి నాయుడినే కొనసాగిస్తున్నారు. 
 
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాలుగు మండలాలుంటే అన్నింట్లోనూ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొత్త అధ్యక్షుల ఎంపిక కోసం శ్రీకాళహస్తిలో జరిగిన సమావేశంలో పెద్ద గొడవే జరిగింది. దీంతో పాత వారినే కొనసాగిస్తున్నారు. 
 
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రంగా ఉన్నాయి. నియోజకవర్గం తెలుగుదేశం కన్వీనర్‌ హరికృష్ణను కాదని అక్కడి తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే సామాజిక వర్గం వారికే పదవులు కట్టబెట్టడం పుండుమీద కారం చల్లినట్లుగా తయారైంది. 
 
నారాయణవనం టీడీపీ నాయకుల మధ్య కుమ్ములాటలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ తలారి మనోహర్‌కు వాడవాడల నుంచి కలెక్షన్లు సమకూర్చే గిరిబాబుకు పదవి కట్టబెట్టడంతో భాస్కరన్‌ గ్రూపు పార్టీని వీడేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే గుర్తింపు లేకుండా ప్రజా బలం లేని వారికి అధ్యక్షపదవి ఎలా ఇస్తారని వారు అంటున్నారు. భాస్కరన్‌ గ్రూపు ఎమ్మెల్యే నిర్వహించే ఏ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు సమాచారం. 
 
సత్యవేడు నియోజకవర్గ వరదయ్యపాళ్యంలో పరిస్థితి టీ కప్పులో తుపానులా ఉంది. ఎమ్మెల్యే తలారి ఆదిత్య నాన్న మనోహర్‌కు, జెడ్పీటీసీ సరస్వతమ్మ కొడుకు కరుణాకర్‌నాయుడుకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నా ఆయనకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తుండటం అక్కడి కేడర్‌లో అసంతృప్తికి కారణమని తెలిసింది. తలారి మనోహర్‌ ప్రతిపాదిం చిన చలపతినాయుడు ఐవీఆర్‌ఎస్‌ ఓ టింగ్‌లో ఓడిపోయినా ఆయననే తిరిగి మండలాధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ఇం తకుముందు రెండుసార్లు పదవి కోసం పోటీ చేసిన మైనారిటీ నాయకుడు నవాబును ఈ సారీ పక్కన పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement