ప్రశ్నార్థకంగా తీర ప్రాంతాల భద్రత | coastal areas are not security | Sakshi
Sakshi News home page

ప్రశ్నార్థకంగా తీర ప్రాంతాల భద్రత

Dec 13 2013 2:43 AM | Updated on Sep 2 2017 1:32 AM

11 మండలాలు.. 72 గ్రామాలు.. 102 కిలోమీటర్లు.. జిల్లాలోని గుడ్లూరు మండలం ఏలూరుపాడు నుంచి చీరాల మండలం పచ్చమొగిలి వరకూ సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది.

 సాక్షి, ఒంగోలు :
 11 మండలాలు.. 72 గ్రామాలు.. 102 కిలోమీటర్లు.. జిల్లాలోని గుడ్లూరు మండలం ఏలూరుపాడు నుంచి చీరాల మండలం పచ్చమొగిలి వరకూ సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. సముద్ర మార్గం నుంచి ఉగ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు పట్టణాల్లోకి చొరబడకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా మెరైన్ పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా మెరైన్ విభాగానికి మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో తీర ప్రాంతంలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కొత్తపట్నం, రామాయపట్నంలలో మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసినా వాటికి సంబంధించి పక్కా భవనాల నిర్మాణం ఇంతవరకూ చేపట్టలేదు. ప్రస్తుతం అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. రెండు జీపులు, స్టేషన్‌కు రెండు చొప్పున నాలుగు బైక్‌లు మాత్రమే అందజేశారు తప్ప పోలీసు సిబ్బంది సముద్రంలోకి వెళ్లేందుకు అవసరమయ్యే బోట్లను ఇప్పటివరకూ ఇవ్వకపోవడం గమనార్హం.
 
  ముఖ్యంగా మెరైన్ సిబ్బంది నిత్యం 12 నాటికల్ మైళ్లు సముద్రం లోపలికి, 5 కిలోమీటర్లు సముద్రం తీర ప్రాంతంలోని గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా? అక్రమ రవాణాలు జరుగుతున్నాయా? అని లోతుగా పరిశీలించాల్సి ఉంది.  దీంతోపాటు తీర ప్రాంత గ్రామాల్లో నివసించే మత్స్యకారులకు పూర్తిస్థాయిలో గుర్తింపు కార్డులు ఇచ్చారా, లేదా అనే విషయమై మత్స్య, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడాల్సి ఉంది. కారణాలేవైనా సిబ్బంది పూర్తిస్థాయిలో గస్తీ చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
 తరచూ హైఅలర్ట్ మెసేజ్‌లు
 చైనా, పాకిస్తాన్‌లకు చెందిన ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడే అవకాశాలున్నాయంటూ నిఘా వర్గాల నుంచి జిల్లా పోలీసు యంత్రాంగానికి తరచూ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన ఒక సబ్‌మెరైన్ సుమారు 40 రోజులపాటు మన దేశ సరిహద్దుల్లోకి సముద్ర మార్గం నుంచి వచ్చినా నిఘా వర్గాలేవీ పసిగట్టలేకపోయాయి. తిరిగి వెళ్లిపోయిన తరువాత నిఘా వర్గాలు గుర్తించగలిగాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు హైఅలర్ట్.. అంటూ తరచూ హెచ్చరికలు పంపుతూనే ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంకల సముద్ర తీర ప్రాంతాలను తమ స్థావరాలుగా మార్చుకుని తద్వారా దేశంలోకి చొరబడవచ్చన్నది నిఘా వర్గాల హెచ్చరికల సారాంశం. అంతేకాకుండా ఏడాది క్రితం కేరళ సముద్ర తీర ప్రాంతానికి ఒక కంటైనర్ వచ్చిందని, అందులో నుంచి పెద్ద ఎత్తున నగదు కొందరికి అందిందనే సమాచారం అప్పట్లో గుప్పుమంది. దీంతో ఆ నగదు మావోయిస్టులకు చేరిందా? టైస్టులకు చేరిందా? అన్న అనుమానం నిఘా వర్గాల్లో బలంగా ఉంది. ఈ రెండు సంఘటనల తర్వాత సముద్ర మార్గం నుంచి చొరబాటు దారులకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
 ముంబై దాడుల వల్లే..
 2008 నవంబర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు కసబ్, మరో 8 మంది సముద్రమార్గం నుంచి దేశంలోకి వచ్చి ముంబైలో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమై రాష్ట్రాల్లో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో మెరైన్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2010 జనవరిలో శ్రీలంకకు చెందిన ఆరుగురు జాలర్లు గుంటూరు జిల్లా నిజాంపట్నం వద్దకు ప్రవేశించారనే కారణంగా అప్పట్లో వారిని మెరైన్ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నెల్లూరు జిల్లా మైపాడు తీర ప్రాంతంలో ఈ నెల 4న శ్రీలంకకు చెందని ఐదుగురు మత్స్యకారులను మర పడవలతో సహా కృష్ణపట్నం మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుండటంతో నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండాలంటూ హైఅలర్ట్ మెసేజ్‌లు పంపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement