ఆక్వా హామీలు మరిచి'నారా'!

CM's formula to reduce power tariff - Sakshi

విద్యుత్‌ చార్జీల తగ్గింపు ఏదీ 

కౌంట్‌కు రూ.30 పెంపు ఎక్కడ

 రైతుల ఆవేదన 

ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హమీలు నీటిమీద రాతలుగా మారాయి. విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని చేసిన ప్రకటనపై ఇంకా అధికారిక ఆదేశాలు రాలేదు. సీఎం సమక్షంలో ప్రతి కౌంట్‌కు రూ.30 చొప్పున పెంచుతామని వ్యాపారులు రైతులకు ఇచ్చిన మాటా నిలబెట్టుకోలేదు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగిన ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు రొయ్యల ధరలు పెంచేలా చర్యలు తీసుకుంటామని, విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలు మూడు వారాలు దాటినా అమలులోకి రాలేదు. ప్రతి కౌంట్‌కు రూ.30 పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకూ రూ.పది నుంచి రూ.20లోపే పెరిగాయి. 

జగన్‌ వరాలతో కదలిక..
ఒకప్పుడు డాలర్లు కురిపించిన ఆక్వాసాగు నేడు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గిట్టుబాటు ధరలు పడిపోవడం, మరోవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడంతో 
ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు తగ్గాయని కుంటిసాకులు చెబుతూ దళారులు ధరలు తగ్గించి వేయడంతో రైతులు పూర్తిగా నష్టాలలో కూరుకుపోయారు. గత నెలలో పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలలో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తమ ఇబ్బందులు తీసుకువెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు.

 ఆక్వా చెరువులకు ఉపయోగించే విద్యుత్‌ చార్జీలను యూనిట్‌ రూ.3.80 నుంచి రూ.1.50కి తగ్గిస్తానని, ఆక్వా అనుబంధ పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.ఏడు నుంచి రూ. ఐదుకు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సముద్ర తీర ప్రాంతాల్లో కోల్డ్‌స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పుతానని భరోసా ఇచ్చారు.  ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటిస్తానని వరాలిచ్చారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై వైఎస్‌ జగన్‌ తీవ్రంగా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక మొదలైంది. 

హడావుడిగా సమావేశం 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నెల 26న హడావుడిగా సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా వ్యాపారులు, రైతులతో చర్చించారు. ఆ సమావేశంలో పాల్గొన్న వ్యాపార ప్రతినిధులు ప్రతి కౌంట్‌కు రూ.30 చొప్పున పెంచుతామని ముఖ్యమంత్రి సమక్షంలో హామీ ఇచ్చారు.ఆ సమావేశం జరిగిన రెండు రోజులకు రూ.పది  పెంచగా మరో పది రోజులకు మరో రూ.పది ధర పెంచారు. దీంతో ఇప్పటి వరకూ ప్రతి కౌంట్‌కు రూ.20 మాత్రమే పెరిగింది.  ఇప్పటి వరకూ ప్రభుత్వం వైపు నుంచి ధరలపై సమీక్ష జరిపిన పాపాన పోలేదు. మరోవైపు విద్యుత్‌ చార్జీలు ఏడాది పాటు రూ.3.80 నుంచి రూ.రెండుకు తగ్గిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఈ హామీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. వచ్చేనెల నుంచి అయినా అమలు చేస్తారన్న ఆశతో ఆక్వా రైతులు ఉన్నారు.

హామీ నిలబెట్టుకోలేదు
ఆక్వా రంగాన్ని ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అమలు కాలేదు. ప్రతి కౌంట్‌కు రూ.30 పెంచుతామన్న మాటను నిలబెట్టుకోలేదు. ఇప్పటి వరకు రూ.20 మాత్రమే పెరిగింది. మరో రూ.పది పెంచడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. తమను చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు. విద్యుత్‌ చార్జీల తగ్గింపుపై కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయాలి.
– వేగేశ్న సత్యనారాయణరాజు, భీమవరం, రొయ్య రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top