సీఎం వైఎస్‌ జగన్‌ : రైతుకు భరోసా ఉంటేనే.. రాష్ట్రానికి భరోసా | YS Jagan Speech at Rythu Bharosa Launch Event at Nellore - Sakshi
Sakshi News home page

రైతుకు భరోసా ఉంటేనే.. రాష్ట్రానికి భరోసా: సీఎం జగన్‌

Oct 15 2019 1:59 PM | Updated on Oct 15 2019 3:39 PM

CM YS Jagan Speech At Rythu Bharosa Scheme Launch Program Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు:  ‘అభివృద్ది అంటే జీడీపీ లెక్కలు మాత్రమే కాదు.. రైతు కుటుంబం బాగుండడాన్నే అభివృద్దిగా భావిస్తాను. రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్దిలో ప్రయాణిస్తున్నట్టు నేను నమ్ముతాను. రైతుకు భరోసా ఉంటేనే.. రాష్ట్రానికి కూడా భరోసా ఉంటుంది. నిన్నటి కన్నా ఈ రోజు మన పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ది చెందినట్లు’అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’పథకాన్ని మంగళవారం నెల్లూరు సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో రైతు భరోసా పథకం లబ్దిదారులకు చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. తాను మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తానని.. ఇచ్చిన హామీకి మరిన్ని మెరుగులు దిద్ది అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ మండలంలో కోల్డ్‌ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాన్న గారి స్పూర్థితో రానున్న రోజుల్లో గొప్ప మార్పులు తీసుకొస్తానని అన్నారు. రైతు భరోసా కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

నా పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా
‘జలాశయాలు నిండుగా ఉండటం,నాట్లు బాగే పడే పరిస్థితి రావడం అదృష్టం. నాన్న గారి హయాం తర్వాత సోమశిలలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉందని రైతులు అంటున్నారు. దేవుడు నిండు మనసుతో రైతులను ఆశీర్వదించాడు. ప్రభుత్వం రైతులను గుండెల్లో పెట్టుకుంది. నా పాదయాత్రలో రైతుల కష్టాలను చూశాను. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు లేక రైతులు పడ్డ ఇబ్బందులను నా కళ్లారా చూశాను. బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అరకొరగా ఇచ్చిన పరిస్థితులను నెలకొనడం పరిశీలించాను. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేక వేలం వేసుకున్ను పరిస్థితులు నన్ను బాధించాయి. గత ఐదేళ్లలో లక్షల రైతుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశాం. 

2017లోనే చెప్పా రైతు భరోసా అందిస్తానని
రైతుల కష్టాలను చూసి 2017 పార్టీ ప్లీనరీ సమావేశంలోనే రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చా. మేనిఫెస్టోలో కూడా తొలి వాగ్దానంగా రైతు భరోసా ప్రకటించాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తా. ఇచ్చిన హామీకి ఇంకా మెరుగులు దిద్ది ఆమల్లోకి తీసుకొచ్చాం. చెప్పిన దాని కంటే అదనంగా ఐదేళ్లలో రూ. 17,500 ఇస్తున్నాం. ప్రతీ ఏడాది రూ.13,500 చోప్పున ఐదేళ్లు ఇస్తాం. మేలో రూ. 7,500, అక్టోబర్‌లో రూ.4,000, సంక్రాంతికి రూ.2,000 రైతుల అకౌంట్‌లోకి నేరుగా జమచేస్తాం. కౌలు రైతులకు కూడా న్యాయం చేసేందుకు రైతు భరోసా అమలు చేస్తాం. అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం వర్తిస్తుంది. రైతు భరోసాతో సుమారు 54 లక్షల మంది రైతన్నలకు మేలు జరుగుతుంది.  

రూ. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
ఇప్పటికే 60 శాతం ఫీడర్లలో రైతులకు పగటి పూట 9 గంటల కరెంట్‌ సరఫరా చేస్తున్నాం. మరో 40 శాతం ఫీడర్లలో వచ్చే జులై నాటికి పగటి పూట కరెంట్‌ అందిస్తాం. రూ. 2,164 కోట్లతో రైతు భీమాను ప్రభుత్వమే భరిస్తుంది. రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. యూరియా కొరత లేకుండా చేశాం. రూ. 2,000 కోట్లతో విపత్తుల నివారణ నిధిని ఏర్పాటు చేశాం. చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు మిల్లెట్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ. 1.50కే కరెంట్‌ ఇచ్చి ఆదుకుంటున్నాం. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ. 7 లక్షల పరిహారం అందిస్తాం. ఆవులు, గేదెలు మరణిస్తే రూ. 15, 000-30,000 వేల పరిహారం ఇస్తాం. గొర్రెలు, మేకలు చనిపోతే రూ. 6 వేలు ఇస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేస్తాం.

నవంబర్‌ 15 వరుకు దరఖాస్తు చేసుకోవచ్చు
రైతు భరోసా కింద ప్రతి రైతుకు సొమ్మును అందజేస్తున్నాం. మిగిలిన 14 లక్షల మంది రైతులకు కూడా ప్రతి వారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అప్‌డేట్‌ చేస్తూ రైతు భరోసా సొమ్మును చెల్లిస్తాం. ఎవరైనా మిగిలి ఉంటే నవంబర్‌ 15వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మార్వో కార్యాలయాల్లో కూడా జాబితాను అందుబాటులో ఉంచుతాం. మిగిలిన వారు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి గురువారం పేమెంట్‌ అప్‌డేట్‌ అవుతుంది. నా తపన, నా తాపత్రయం ప్రతి రైతుకు మంచి జరగాలన్నదే. మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరికైనా డబ్బులు రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. జాబితా చూసుకోండి. అర్హతలు కూడా అందుబాటులో ఉంచుతాం. వెంటనే నమోదు చేసుకోండి. నేరుగా మీ ఖాతాలోనే డబ్బు వచ్చి పడుతుందని ప్రతి రైతుకు చెబుతు.. రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. నెల్లూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రతీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నా’అంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగించారు.

చదవండి: 
నా జన్మంతా జగనన్నకు సైనికుడిగానే ఉంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement