నా జన్మంతా జగనన్నకు సైనికుడిగానే ఉంటా: మంత్రి అనిల్‌

Minister Anil Kumar Emotional Speech At Rythu Bharosa Scheme Launch Program - Sakshi

సాక్షి, నెల్లూరు:  ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం  నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతు భరోసా చెక్కులు అందించిన తర్వాత ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు.  రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవంలో అనిల్‌కుమార్‌యాదవ్‌ ఉద్వేగంగా మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రమేనని.. తనను ఎమ్మెల్యేగా, జిల్లాలో బీసీ మంత్రిగా చేశారని.. ఇంతకంటే తనకేమి అవసరం లేదని, నా జన్మ ధన్యమైందని మంత్రి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. జీవింతాంతం జగనన్న అనుచరుడిగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ ఇంకా ఏం మాట్లాడారంటే....

‘మన జిల్లాలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలో రైతులకు సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. నాడు పాదయాత్రలో రైతులకు నాలుగేళ్ల పాటు ఏటా రూ,12,500 ఇస్తామన్న మన నేత ..ఇవాళ దానికి మరో వెయ్యి పెంచి తండ్రికి తగ్గ తనయుడని మరోసారి నిరూపించుకున్నారు. మనసున్న రాజు ఉంటే ఆ భగవంతుడు సైతం కరుగుతాడని నానుడి ఉంది. ఈ రోజు రాష్ట్రంలోని జలాశయాలన్నీ కూడా నీటితో కళకళలాడుతున్నాయి. దివంగత మహానేత వైఎస్సార్‌ పాలన తరువాత మరోసారి పులిచింతల, సోమశీల వంటి ప్రాజెక్టులు నిండాయి. 75 టీఎంసీల నీటిని నిల్వ చేసింది ఈ ఏడాదినే. నిన్న చంద్రబాబు ఇక్కడికి వచ్చి తన వల్లే జలాశయాలు నిండాయని చెప్పారు. చాలా ఏళ్ల తరువాత చంద్రబాబు నిజం చెప్పారు.  ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదు. ఆయన సీఎంగా దిగిపోగానే జలాశయాలు నిండాయి.

ఇవాళ వైఎస్‌ జగన్‌ జిల్లాలో అడుగుపెట్టగానే వర్షం కురిసి ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికింది. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమోకానీ ..స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ జిల్లాలో ఏ బీసీకి మంత్రి పదవి ఇవ్వలేదు. 50 ఏళ్ల తరువాత మన సీఎం వైఎస్‌ జగన్‌ నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇంతకన్న నా జన్మకు ఇంకేం కావాలి. నా తండ్రి పైనున్నారు. నా తల్లి ఇక్కడే ఉంది. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సైనికుడిగానే ఉంటాను. నన్ను ఎమ్మెల్యే చేశారు..మంత్రిని చేశారు. ఇంతకంటే ఇంకేం కావాలి. ఆయన అనుచరుడిగానే ఉంటాను. ఈ జిల్లాలో  ప్రతి ఎకరాకు సాగునీరు అందించబోతున్నారు. ఇంకా 25 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎవరు ఎన్ని గింజుకున్నా వేరేవారికి అవకాశం లేదు. నా జన్మంతా జగన్నన్నకే సేవకుడిఆ ఉంటాను’అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top