‘అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ’

CM YS Jagan Says Thanks To AP People For Cooperating To Lockdown - Sakshi

సాక్షి, అమరావతి : దేశంలోనే అత్యధిక కరోనా వైరస్‌ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, ప్రతి 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈనెల రోజుల్లో టెస్టింగ్‌ సౌకర్యాలను పెంచుకున్నామని, కరోనా వైద్య పరీక్షల కోసం రాష్ట్రంలో 9 వీఆర్‌డీఎల్‌, 44 ట్రూనాట్‌ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ప్రతిరోజూ శాఖల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులకు సూచనలు చేయటంతో పాటు తదనుగుణ ఆదేశాలు జారీచేస్తున్నారు. సోమవారం కూడా కరోనాపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 74,551 టెస్టులు చేశామని వెల్లడించారు. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను ఇప్పటికే గుర్తించామన్నారు. రెడ్‌జోన్‌లో 63, ఆరెంజ్‌ జోన్‌లో 54, గ్రీన్‌ జోన్‌లో 559 మండలాలున్నాయని, 5 కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు. క్వారంటైన్‌ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. 

జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుంది
‘‘ కరోనా వ్యాధి సోకితే అంటరానితనంగా భావించొద్దు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుంది. కరోనా ఉన్నట్లుగా 80శాతం మందికి తెలియనే తెలియదు. ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా వ్యాపిస్తుంది. 81శాతం మందికి ఇళ్లల్లో ఉంటేనే నయమవుతున్నాయి. కేవలం 14 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి. రోగ నిరోధకశక్తి పెంచుకునేలా ఆహారపు అలవాట్లు ఉండాలి. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో చేసిన 70శాతం పరీక్షల్లో...1.61 శాతం మాత్రమే పాజిటివ్‌ కేసులొచ్చాయి. భౌతికదూరం కచ్చితంగా పాటించాలి. మనిషికి, మనిషికి మధ్య ఒక మీటర్‌ దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రతి ఇంటికి మాస్కులు అందిస్తున్నాం. ప్రతి మనిషికి మూడు మాస్కులు ఇవ్వాలని ఆదేశాలిచ్చా’’మని అన్నారు.

సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చర్యలు
‘‘ ఆర్థికలోటు ఉన్నా.. సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే మూడుసార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించాం. నెలరోజుల్లో మూడుసార్లు రేషన్‌ అందించే ఏర్పాట్లు చేశాం. ప్రతి పేద కుటుంబానికి రూ.వెయ్యి సాయం అందించాం. 56 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్‌ అందించాం. రోగుల కోసం ఏర్పాటు చేసిన 40 వేల బెడ్స్‌లో 25 వేలు సింగిల్‌ ఐసోలేషన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ప్రతి ఆస్పత్రిలో మాస్కులు, ప్రొటెక్షన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌ ఆస్పత్రుల్లో అదనంగా డాక్టర్లు, నర్సులు, టెక్నీషీయన్లను భర్తీ చేశాం. 14410 టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top