వినూత్న విధానాలు అనుసరించండి | CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention | Sakshi
Sakshi News home page

వినూత్న విధానాలు అనుసరించండి

Apr 19 2020 3:46 AM | Updated on Apr 19 2020 4:13 AM

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 విపత్తుసమయంలో ఉద్యాన పంటలకు స్థానికంగా మార్కెట్‌ కల్పించడంలో భాగంగా కర్నూలు జిల్లాలో రూ.100లకు ఐదు రకాల పండ్ల పంపిణీ చేయడం బాగుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను కొనియాడారు. వినూత్న మార్కెటింగ్‌ విధానాలతో మార్కెటింగ్‌ శాఖ మరింత ఉధృతంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. తాజా సడలింపులతో రవాణా వ్యవస్థలో కాస్త కదలిక వచ్చిందని.. ప్రస్తుతం 35 శాతానికి రవాణా చేరుకుందని సీఎంకు అధికారులు వివరించారు. కరోనా నివారణ చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించిన ముఖ్యాంశాలు ఇవీ..

– ల్యాబ్‌లు, ట్రూనాట్‌ మిషన్ల ద్వారా ఒక్క శుక్రవారం రోజే 4 వేలకు పైగా పరీక్షలు.
– ర్యాపిడ్‌ టెస్ట్, స్క్రీనింగ్‌ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుంది.
– కరోనాకు ముందు తిరుపతిలో ఒకటే ల్యాబ్‌ ఉందని.. తర్వాత వీటి సంఖ్య 7కు పెరిగింది.
– వారం రోజుల్లో ల్యాబ్‌ల సంఖ్య 12కు పెంపు.
– తిరుపతిలో అదనంగా 2, కర్నూలులో ఒకటి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఒక్కో ల్యాబ్‌ చొప్పున ఏర్పాటు.
– టెలీమెడిసిన్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు 5,219 మిస్డ్‌కాల్స్‌ వచ్చాయి.
– రిటర్న్‌ కాల్‌ చేసి వారికి వైద్య సేవలు అందించారు.
– అవసరమైన వారికి ప్రిస్క్రిప్షన్లు పంపి వారికి మందులు కూడా ఇస్తున్నాం.
– శుభ్రత, పారిశుధ్యం, క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై సీఎం ఆదేశాల ప్రకారం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం.

సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం
ఇదిలా ఉంటే.. విపత్తు సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించడానికి  ప్రభుత్వం ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ రైతులను ఆదుకుంటున్న సమయంలో కూడా కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ చైర్మన్‌ నాగిరెడ్డి సీఎం వైఎస్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఒక పత్రిక ఎడిటర్‌కు రొయ్యల వ్యాపారి ఫోన్‌చేసి ప్రభుత్వాన్ని తిట్టినట్లుగా సృష్టించారని.. దీనిని యూట్యూబ్‌లో ప్రచారం చేశారని ఆయన చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డి కోరారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement