ప్రధాని ‘జనతా కర్ఫ్యూ’కు సీఎం జగన్‌ సంఘీభావం

CM YS Jagan Mohan Reddy Support Janata Curfew - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 22న (ఆదివారం రోజున) ప్రజలందరూ జనతా కర్ఫ్యూను స్వచ్చందంగా పాటించాలని కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది, మెడికల్‌ సర్వీసులు, అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్తు, పాలు వంటి నిత్యావసర/అత్యవసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులు చేసేవారు తప్ప మిగతా ప్రజానీకం అంతా వారి ఇళ్లకే పరిమితం కావాలని సీఎం జగన్‌ కోరారు. 

‘అదేవిధంగా ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ప్రజలందరూ బాల్కనీలు/ఇంటి ద్వారాలు/కిటికీల వద్దకు వచ్చి కరోనా వైరస్‌ నివారణకు విశేషంగా సేవలందిస్తున్న సిబ్బందికి, ప్రజలకు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న వారికి మద్దతుగా ఐదు నిమిషాల సేపు నిలబడి చప్పట్లు కొడుతూ, గంటలు మోగిస్తూ వారిని అభినందించాలి.  దీనికి సంకేతం ఇవ్వడానికి సరిగ్గా ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక అధికారులు సైరన్‌ మోగిస్తారు. అందుకు అందరూ సమయాత్తంగా ఉండాలని, ప్రయాణాలు, పనులను ఆరోజు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. 

పోలీసులు, వైద్య సిబ్బంది, మెడికల్‌ సర్వీసులు, విద్యుత్తు, అగ్నిమాపక సిబ్బంది, పాలు వంటి నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా సర్వీసులన్నింటినీ జనతా కర్ఫ్యూకు సంఘీభావంగా స్వచ్ఛందంగా నిలిపేయాలని కోరుతున్నాను. కోవిడ్‌ –19 వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సోషల్‌డిస్టెన్స్‌ను పాటించడానికి జనతా కర్ఫ్యూ ఉపయోగపడుతుందని ఆశిద్దాం. ఇది ఒక ప్రారంభంగా భావిద్దాం. కోవిడ్‌ –19 మహమ్మారి నివారణకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం ముందు ఉంటుందని చాటుదాం’అంటూ సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

చదవండి:
మీ ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి: కేరళ బామ్మ
కరోనా : బీఎస్‌ఎన్‌ఎల్‌, నెల రోజులు ఫ్రీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top