వివక్షకు తావులేదు

CM YS Jagan Launches AP Corporation for Outsourced Services - Sakshi

పారదర్శకంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం.. గ్రీన్‌ చానల్‌లో వేతనాలు

‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు 50,449

కార్పొరేషన్‌ను విజయవంతం చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలి

50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు..

వాటిలో 50% మహిళలకు జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌ 

మంత్రులు రిజర్వేషన్ల ప్రక్రియను పర్యవేక్షిస్తారు

గతంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా చూపి కాంట్రాక్టర్లు, నేతలు పంచుకునే వారు

దళారులు, కమీషన్ల వ్యవస్థకు చెక్‌ 

ఉద్యోగులందరూ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా పని చేయాలి

‘ఆప్కాస్‌’ ద్వారా ఇప్పుడు ఒకేసారి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తున్నాం. ఇది ఒక డైనమిక్‌ నంబర్‌. ప్రతి నెలా ఈ నంబర్‌ మారిపోతుంది. రాబోయే రోజుల్లో అన్ని శాఖలు కార్పొరేషన్‌తో అనుసంధానమవుతాయి. దీంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ‘ఆప్కాస్‌’తో వివక్ష లేకుండా ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగులకు ఠంచనుగా ప్రతి నెలా గ్రీన్‌ చానల్‌ ద్వారా జీతాలు వస్తాయి. వాటిలో కమీషన్లు, లంచాలు, కోతలు ఉండవు. పద్ధతి ప్రకారం జీతాలు ఇస్తారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ క్రమం తప్పకుండా జమ చేయడం ద్వారా ఉద్యోగులకు మేలు జరుగుతుంది. 
 

ఈ రోజు ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌) ప్రారంభం కావడం అన్నది నిజంగా  వ్యవస్థల్లో మార్పు దిశగా మరో అడుగు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాల్లో ఎక్కడా వివక్షకు తావుండకూడదు. 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వాలి. వాటన్నింటిలో 50 శాతం మహిళలు ఉండాలి. దళారులు, ప్లేస్‌మెంట్‌ ఏజెంట్ల వ్యవస్థ, కమీషన్లకు తావు లేకుండా చేసేందుకే ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాం.                
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచనుగా ఏ కోత లేకుండా గ్రీన్‌ చానల్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడంతో పాటు, లంచాల ప్రసక్తి లేకుండా పారదర్శకంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కొండంత అండగా నిలుస్తూ ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌) కార్యకలాపాలను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఒకేసారి 50 వేల మందికి పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించేందుకు కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అనంతరం వివిధ జిల్లాల్లోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినికి నియామక పత్రం అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

విన్నాను.. చూశాను.. 
► నా సుదీర్ఘ పాదయాత్రలో అన్ని ప్రాంతాలు తిరిగాను. 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు నడిచాను. అప్పుడు ప్రతి చోట ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బాధలు విన్నాను.. చూశాను. ‘ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం జరుగుతోంది’ అని ఒక్కచోట కూడా ఎవరూ చెప్పలేదు.  

► మాకు కాంట్రాక్ట్‌లో ఒక జీతం చూపి, అంతకంటే తక్కువ జీతం ఇస్తున్నారని, కాంట్రాక్టర్‌ మా జీతం కట్‌ చేస్తున్నారని కొంత మంది చెప్పారు. ‘అన్నా.. ఈ ఉద్యోగం రావడానికి లంచాలివ్వాలి. మళ్లీ జీతాలు తీసుకోవడానికి కూడా లంచాలివ్వాలి.. ఇవి రెండూ ఇవ్వకపోతే మమ్నల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు’ అని మరికొంత మంది ప్రతి జిల్లాలో చెప్పారు.  

► ఔట్‌ సోర్సింగ్‌లో కొందరికి మేలు చేయడం కోసం కాంట్రాక్టర్లను తీసుకువచ్చారు. నాడు కొన్ని చోట్ల నాయకులు ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్లుగా మారారు. ఆలయాల్లో పారిశుధ్య కాంట్రాక్ట్‌ పనుల మొత్తాన్ని అమాంతంగా పెంచి చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు.  

ఈ పరిస్థితిని మార్చేందుకే.. 
► అందుకే ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి, పారదర్శకత తేవాలనుకున్నా. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని, ఎవరికీ లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని భావించి ‘ఆప్కాస్‌’ ఏర్పాటు చేశాం. 

► ఈ కార్పొరేషన్‌లో రెండు కేంద్రాలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా జేసీలతో కూడిన కమిటీలు పని చేస్తాయి. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు. దీంతో ఎక్కడా అవినీతికి తావుండదు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది బాగా పని చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేయాలి.  

గతంలో ఎక్కువ చూపి కొట్టేసే వారు 
► గతంలో కాంట్రాక్ట్‌ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను ఎక్కువ చూపి, తక్కువ సంఖ్యలో నియమించి వారితో పని చేయించుకునేవి. 20 మంది పని చేయాల్సి ఉండగా 15 మందినే నియమించి మిగతా ఐదుగురి వేతనాలను ఆ కాంట్రాక్టర్లు, ఇతర నేతలు పంచుకునేవారు. ఇప్పుడు ఈ కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా వాటన్నింటికీ తావుండదు. 

► కార్పొరేషన్‌ను సక్సెస్‌ చేయడం కోసం కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా అంతా మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నా.  

► సాధారణ పరిపాలన శాఖకు చెందిన ముగ్గురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్‌ నియామక పత్రాలను అందించారు. జిల్లాల్లో కలెక్టర్లు, మంత్రులు నియామక పత్రాలు అందించాలని సీఎం సూచించారు. 
► ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.   

జీవితాంతం రుణపడి ఉంటాం 
మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ ప్రారంభించిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. గతంలో మా జీతం నెలలో ఏ రోజు తీసుకుంటామో తెలియని పరిస్థితి ఉండేది. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ పరిస్థితే తెలిసేది కాదు. ఒకే డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు రకరకాలుగా జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆప్కాస్‌ ద్వారా మధ్యవర్తిత్వం, దళారీ వ్యవస్థను నిర్మూలించినందుకు సంతోషంగా ఉంది. కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం. 
– జె.సూరిబాబు, టైపిస్ట్, కొత్తపల్లి తహసీల్దార్‌ ఆఫీస్, తూర్పు గోదావరి జిల్లా   

మీకు మంచి పేరు తెస్తాం 
‘ఇచ్చిన మాట మేరకు మాకు న్యాయం చేశారు.. మేము బాగా పని చేసి మీకు మంచి పేరు తీసుకువస్తాం.. దళారుల ప్రమేయం లేకుండా మాకు జీతాలు అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.. జీవితాంతం మీకు రుణ పడి ఉంటాం’ అని శుక్రవారం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సీఎం జగన్‌తో తమ మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

మాట నిలుపుకున్నారు..
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా నెల నెలా జీతాలు అందనుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. ఎన్నో కష్టాలు పడ్డాము. నెలనెలా జీతం రాక, కాంట్రాక్టర్‌  మారుతున్నప్పుడల్లా ఈ ఉద్యోగం ఉంటుందో, ఉండదోనని భయపడ్డాము. ఆనాడు పాదయాత్రలో మిమ్మల్ని కలిశాను. ఇచ్చిన మాట మేరకు మాకు న్యాయం చేస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరి తరఫున మీకు కృతజ్ఞతలు.    
    – లక్ష్మీకాంతం, జూనియర్‌ అసిస్టెంట్, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ, శ్రీకాకుళం జిల్లా

ఇక కష్టాలు తప్పినట్లే..
మీరు మా కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ ద్వారా ఒకటో తేదీనే జీతాలు వస్తాయని తెలిసి ఎంతో సంతోష పడుతున్నాం. మా వంతుగా మేం కూడా సక్రమంగా పనిచేసి, మీకు మంచి పేరు తీసుకువస్తాం. నేను 2007 నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాను. సకాలంలో జీతాలు రాక, నెల నెలా పిల్లల ఫీజులు కట్టుకోలేక, నిత్యావసరాలు కూడా కొనుగోలు చేయలేక, అప్పులు చేసుకుంటూ ఇల్లు గడుపుకునేవాళ్లం. ఇక అలాంటి కష్టాలు తప్పినట్లేనని తెలిసి సంతోషిస్తున్నాం. 
    – మేరి సుచిత్ర, డేటా ఎంట్రీ ఆపరేటర్,  పామిడి తహసీల్దార్‌ ఆఫీస్, అనంతపురం జిల్లా

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు శుక్రవారం పండగ చేసుకున్నారు. తమ జీవితాలకు భరోసా కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యాలయాల్లో ఉద్యోగులు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. కేక్‌లు కట్‌ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 

చరిత్రాత్మక నిర్ణయం 
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా పొరుగు సేవల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయమని ఔట్‌ సోర్సింగ్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రాప్తాడు దయాకర్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ వైవీ రావులు అభినందించారు. ఇందుకు వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఒకేసారి 50 వేల మందికి పైగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేయడం ద్వారా వారి జీవితాలకు ఒక భరోసా కలిగిందన్నారు. తద్వారా దళారులు లేని వ్యవస్థ ఏర్పాటైందని, ఈ ఉద్యోగులకు కూడా పెరుగుతున్న ధరల సూచికకు అనుగుణంగా డీఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top