విశాఖలో ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన భూములను క్రమబద్ధీకరించి పట్టాలిచ్చామని, పట్టా తీసుకున్నవారు ఇంటికెళ్లి తనను మరిచిపోతారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పనులన్నీ చేయించుకుని మరిచిపోతారు..
Jul 27 2017 2:15 AM | Updated on Aug 14 2018 11:26 AM
ప్రజలపై సీఎం అసహనం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన భూములను క్రమబద్ధీకరించి పట్టాలిచ్చామని, పట్టా తీసుకున్నవారు ఇంటికెళ్లి తనను మరిచిపోతారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘పింఛన్ తీసుకుంటున్నారు.. మరిచిపోతున్నారు. రేషన్ తీసుకుంటున్నారు..మరిచిపోతున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నా మరిచిపోతున్నారు. మీక్కావల్సిన పనులన్నీ చేయించుకుని నన్ను మరిచిపోవడం ఎంతవరకు సమంజసం?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో బుధవారం సాయంత్రం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 21,225 మందికి క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, శంషాబాద్ ఎయిర్‌పోర్టును తలదన్నేలా భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని చెప్పారు.
మహిళల నిరసన.. గెంటేసిన హోంమంత్రి
పట్టాలిస్తామని చెప్పి ఇక్కడికి పిలిచి ఇప్పుడు రద్దయిపోయింది పొమ్మంటున్నారంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ‘నాకు పట్టా మంజూరైందని డబ్బులు కూడా తీసుకున్నారు..తీరా ఇక్కడకు వస్తే లేదు పొమ్మన్నారు..’ అంటూ తాటిచెట్లపాలేనికి చెందిన పుష్ప సీఎం పేరిట తనకు ఇచ్చిన ఆహ్వాన పత్రికను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా పలువురు మహిళలు వేదిక వద్దకు వచ్చి మీడియా వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో.. హోంమంత్రి చినరాజప్ప అక్కడకు చేరుకుని మీడియాపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, మహిళలను అక్కడినుంచి పొమ్మంటూ గెంటేశారు.
Advertisement
Advertisement