కార్యకర్తల్లో నిరాశ నింపిన ‘బాబు’ ప్రసంగం | Chandrababu Naidu Speech At Achampet Junction In East Godavari | Sakshi
Sakshi News home page

కార్యకర్తల్లో నిరాశ నింపిన ‘బాబు’ ప్రసంగం

Sep 6 2019 9:26 AM | Updated on Sep 6 2019 9:55 AM

Chandrababu Naidu Speech At Achampet Junction In East Godavari - Sakshi

ప్రసంగిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు

సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): పార్టీకి జవసత్వాలు నింపుతానని జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఆ విషయాన్ని మరచిపోయి ఆత్మస్తుతి...పరనిందలకే పరిమితమవడంతో కార్యకర్తల్లో నిరాశ వ్యక్తమయింది. కాకినాడ రూరల్‌ అచ్చంపేట జంక్షన్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో గురువారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ వేదిక నుంచి గంటపాటు సాగిన చంద్రబాబు ప్రసంగం షరా మామూలుగానే ఉంది. మూడు నెలల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయంతో పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌పై విమర్శలకే అత్యధిక సమయాన్ని వృథా చేశారని టీడీపీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. ప్రతిపక్షానికి కనీసం ఆరు నెలల సమయమైనా ఇవ్వకుండా ప్రతి అంశాన్ని చంద్రబాబు వేలెత్తి చూపడాన్ని పార్టీ సీనియర్‌లే ఓ పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇసుక దోపిడీని నిలువరించి, పారదర్శకంగా జిల్లాలో సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తే ఇసుక దోపిడీకి వైఎస్సార్‌సీపీయే కారణమంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చంద్రబాబు చేసినా పెద్దగా స్పందన కనిపించ లేదు. టీడీపీ నేతలపై వేధింపులు, పోలీసు కేసులు ఎక్కువైపోయాయని  వాపోయిన చంద్రబాబుకు ఎన్నికలకు ముందు తుని రైలు ఘటనలో అన్యాయంగా వైఎస్సార్‌ సీపీ కేడర్‌పై పెట్టించిన అక్రమ కేసులు గుర్తుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. పిఠాపురంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేయడమే కాకుండా న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన టీడీపీ నేతల చరిత్ర బాబుకు గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. వచ్చే 30 ఏళ్ల వరకూ పార్టీకి పటిష్టమైన కేడర్‌ అందుబాటులోకి తెస్తాననడం ద్వారా పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పిస్తానని చంద్రబాబు చెప్పుకున్నారు.

కానీ అదే పార్టీ నుంచి చేజారిపోతున్న నేతలను కాపాడుకోవడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కనిపించింది. ఇప్పటికే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నారాయణమూర్తి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ వరుపుల రాజా టీడీపీని వీడి బయటకు వచ్చేశారు. ఈ నెల 8న లేదా నాలుగైదు రోజులు గడిచాక రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని చంద్రబాబుకు కూడా సమాచారం ఉందంటున్నారు. అదే ఉద్దేశంతో త్రిమూర్తులు గురువారం నాటి పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. సమావేశానికి హాజరు కావాలని పార్టీ నేతల ద్వారా చంద్రబాబు తోటకు ఫోన్‌ చేయించగా ఆయన అందుబాటులో లేరనే సమాధానం వచ్చింది. తోటతోపాటు కాకినాడ సిటీ పార్టీ అధ్యక్షుడు నున్న దొరబాబు, టీడీపీకి చెందిన తొమ్మిది మంది కార్పొరేటర్‌లు కూడా సమావేశానికి డుమ్మాకొట్టారు.

వీరిలో ఏ ఒక్కరినీ బుజ్జగించి దారిలో పెట్టుకోలేని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడిగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అచ్చంపేటలో సమావేశం ముగిశాక చంద్రబాబు కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తొమ్మిది నియోజకవర్గాల సమీక్షను నిర్వహించారు. పార్టీకి కంచుకోట అయిన జిల్లాలో ఓటమికి కారణాలు విశ్లేషించకుండా కేవలం అధికార పక్షంపై విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వడంపై చంద్రబాబు 30 ఏళ్ల అనుభం ఇదేనా అని సీనియర్లను విస్మయానికి గురిచేసింది. పార్టీ ఘోర ఓటమిపై సమీక్షిస్తారనుకుని ఎదురుచూసిన నేతలు బాబు వాటి జోలికి పోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement