డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని మహిళల ఆందోళన

డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని మహిళల ఆందోళన


 భీమవరం టౌన్ :‘చంద్రబాబూ... అధికారంలోకి రాగానే తొలిసంతకంతో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చావ్.. నమ్మి ఓట్లు వేసి గెలిపించాం.. అందలం ఎక్కాక ఇచ్చిన హామీని మరిచిపోతావా’  అంటూ భీమవరం మండలంలోని మహిళలు పెద్ద సంఖ్యలో కదంతొక్కారు. భీమవరం మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలంటూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

 ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గొర్ల రామకృష్ణ మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చినందువల్లే మహిళలు టీడీపీకి ఓటు వేసి గెలిపించారన్నారు. అధికారం రాగానే మొదటి సంతకం చేసి మాఫీ చేస్తానని, రుణాలు, వడ్డీలు కట్టవద్దంటూ నమ్మించిన బాబు నేడు నమ్మక ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలరోజులైనా హామీని నెరవేర్చలేదని, దీంతో రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు మహిళలపై ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడా పెట్టుబడిదారులకు సబ్సిడీలు ఇచ్చి వారికి లాభాలు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళల డ్వాక్రా రుణాలను మాఫీ చేయడంలో మీనమీషాలు లెక్కిస్తుందని ధ్వజమెత్తారు.

 

 రైతుల రుణాల మాఫీకి సంబంధించి ఎలాంటి ప్రకటనా విడుదల చేయకుండా రీషెడ్యూల్ చేస్తానని చెబుతున్నారని, ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ నెలాఖరులోపు డ్వాక్రా, రైతు రుణమాఫీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తహసిల్దార్ గంధం చెన్ను శేషుకు వినతిపత్రం అందించారు. సంఘం మండల అధ్యక్షుడు ఇంజేట్టి శ్రీనివాస్, కార్యదర్శి రేవు రామకృష్ణ, కోడి సత్యనారాయణ, లక్కు ముత్యాలు, భారతి తదితరులు పాల్గొన్నారు.

 

 కేశవరంలో డ్వాక్రా మహిళల ధర్నా

 కేశవరం, (గణపవరం) : ఎన్నికల సమయంలో ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీని వెంటనే అమలు చేయాలని కోరుతూ కేశవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి నాలుగు నెలలుగా రుణాలు చెల్లించడం లేదని, బ్యాంకులు రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి నెల దాటినా చంద్రబాబు రుణమాఫీ ఊసెత్తకుండా దాటవేస్తున్నారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వకపోతే ఉద్యమిస్తామని మహిళలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డివిజనల్ కార్యదర్శి ఎం. ఆంజనేయులు, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు సీహెచ్. వెంకటలక్ష్మి, గుబ్బల నాగలక్ష్మి తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top