నాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు  | Chandrababu fires on woman Kakinada Janmabhoomi Sabha | Sakshi
Sakshi News home page

నాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు 

Jan 5 2019 4:25 AM | Updated on Jan 5 2019 7:06 AM

Chandrababu fires on woman Kakinada Janmabhoomi Sabha - Sakshi

లేనిపోని ప్రాబ్లమ్స్‌ పెట్టుకోవద్దు ఇక్కడ..పెట్టుకుంటే మీరు ఫినిష్‌ అయిపోతారు మర్యాదగా ఉండు..చాలా సమస్యలు వస్తాయి..ఢిల్లీలో నిన్న కూడా లాఠీ చార్జీ చేశారు.ఈ నీళ్లు తాగుతున్నారు.. ఈ గడ్డ మీద ఉన్నారు... ఏయ్‌ ఉండండీ.. నేను అడిగింది చెప్పు.. ఏం చేశారు మీ మోదీ.. ముంచాడు అందరినీ.. రాష్ట్రాన్నీ, దేశాన్ని...బయటకు వస్తే వదలరు.. మిమ్మల్ని పబ్లిక్‌...ఏమన్నా ఉందా మీకు కొంచెమైనా..? 
– కాకినాడ జన్మభూమిలో తనను అడ్డుకున్న మహిళలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ)/కాకినాడ:
‘‘నాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు జాగ్రత్త’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తనను అడ్డుకున్న మహిళలను హెచ్చరించారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన  ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులో అడ్డుకున్నారు. ‘సీఎం గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో బస్సులో ఉన్న చంద్రబాబు బయటకు వచ్చి మండిపడ్డారు. మీకు ఏం కావాలంటూ రుసరుసలాడారు. తనను అడ్డుకున్న వారికి రాష్ట్రంలో ఉండే అర్హతలేదంటూ ఆగ్రహంవ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని, రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీని సమర్థిస్తారా అంటూ ధ్వజమెత్తారు. నినాదాలు చేస్తే ప్రజలు కొడతారంటూ హెచ్చరించారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్‌ సాలగ్రామ లక్ష్మీప్రసన్నతో ముఖ్యమంత్రి వాగ్వాదానికి దిగారు. మోదీ ఇచ్చిన నిధుల వివరాలు సీఎంకు ఆమె వివరించే ప్రయత్నం చేస్తుండగా.. ఆయన వినకుండా బస్సు ఎక్కేశారు. కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న వైపు వేలు చూపిస్తూ మర్యాదగా ఉండాలంటూ హెచ్చరించారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నాయకులను అరెస్టు చేసి సర్పవరం స్టేషన్‌కు తరలించారు. 

మోదీ అడ్రస్‌ గల్లంతు కావడం తథ్యం: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్రస్‌ గల్లంతు కావడం తథ్యమని, బీజేపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో జరిగిన ఆరో విడత జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. బీజేపీ పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. 

నాలుగు ఉత్తమ నగరాల్లో ఒకటిగా చేస్తా
రాష్ట్రంలోని నాలుగు ఉత్తమ నగరాల్లో కాకినాడను ఒకటిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే కాకినాడను స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు విమర్శలు చేశారు. సీబీఐకి భయపడి జగన్‌ పార్టీ కేంద్రానికి ఊడిగం చేసేందుకు కూడా వెనుకాడటంలేదని దూషించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జగన్‌ జపం చేస్తున్నారని అక్కడ జరిగిన ఎన్నికల్లో పంపిణీ చేయగా మిగిలిపోయిన వాటిని ఇక్కడకు పంపుతున్నారని విమర్శించారు.

పవన్‌ పోరాడాలి..
మోదీ, జగన్‌పై విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్రంపై పోరాడాలని కోరారు. పవన్‌ నిజనిర్ధారణ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.75 వేల కోట్ల సహాయం అవసరమని ప్రకటించారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నందున ఆ దిశగా ఆయన పోరాటం చేయాలని చంద్రబాబు అన్నారు.  కార్యక్రమంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అధికారులు పాల్గొన్నారు.

బాబు ప్రసంగం.. వెళ్లిపోయిన జనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జన్మభూమి సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుండగానే సభికులు వెళ్లిపోయారు. వందల సంఖ్యలో విద్యార్థుల్ని సభకు తరలించారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభం కావల్సిన సభ మధ్యాహ్నం 1.05కు సీఎం వచ్చిన తర్వాత ప్రారంభమైంది. కానీ, కాసేపటికి జనాలు వెళ్లిపోవడం ప్రారంభించారు. వారిని ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఎం ప్రసంగిస్తుండగానే సభా ప్రాంగణం దాదాపు ఖాళీ అయిపోయింది. దీంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనైయ్యారని,  జన సమీకరణలో విఫలమయ్యారని నేతలపై రుసరుసలాడారని తెలిసింది.

ఎంపీల సస్పెన్షన్‌ దారుణం
సాక్షి, అమరావతి: ఉండవల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులపై జరిగిన లాఠీచార్జిని అందరూ ఖండించాలన్నారు. టీడీపీ ఎంపీల సస్పెన్షన్‌ దారుణమన్నారు. రెండురోజుల్లో 45 మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారని, బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని, రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదని, మంద మెజారిటీతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఎంపీలకు సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement