
బద్వేలు:చిన్న మొత్తాలపై వడ్డీ శాతాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పొదుపు డిపాజిట్లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కడప డివిజన్‌లో దాదాపు 1.20లక్షల మేర పొదుపు ఖాతాల్లోని ఖాతాదారులు తమ చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీని కోల్పోనున్నారు. సామాన్య మధ్య తరగతి వర్గాలు కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువగా చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తుంటారు. రూ.వంద నుంచి రూ.లక్ష వరకు పొదుపు చేసుకునే వీలుం ది. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు వర్తించే ఈ తగ్గింపులో 0.20 శాతం అంటే రెండు పైసల చొప్పున తగ్గుతుంది. ప్రభుత్వ హామీతో పాటు ఆదాయపన్ను మినహాయింపు వర్తించే ప్రయోజనాలు ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం తపాలాశాఖ అందించే ఏడు రకాల పథకాలపై వడ్డీరేటు ప్రభావం పడనుంది. జిల్లాలోని పోస్టల్ డివిజన్‌లో దాదాపు రూ.10 0కోట్లకు పైగా పొదుపు నిల్వలు ఉంటాయి. ఇప్పటి వరకు పొదుపు చేసుకున్న మదుపరులపై తాజా నిర్ణయం ప్రభావం ఉండదు. జనవరి ఒకటి నుంచి పొదుపు చేసే మొత్తాలపై వడ్డీ రేటు తగ్గింపు ప్రభావం ఉంటుంది.
బాలికా పథకాలకుఇబ్బందే:ఆడపిల్లల సంక్షేమం కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకానికి చాలా ఆదరణ ఉంది. కానీ ఈ పథకం వడ్డీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. పుట్టిన ఆడపిల్లకు 14 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పొదుపు చేస్తే ఏటా వడ్డీతో కలిపి 21ఏళ్లకు రూ.6.5లక్షల వరకు అవుతుంది. ఈ పథకం ఆరంభంలో వడ్డీ రేట్టు 9.2శాతం ఉండగా ప్రస్తుతం 8.3 శాతం ఉంది. ఒకటో తేదీ నుంచి ఇది 0.20శాతం తగ్గనుంది. చిన్నపాటి ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేతి కందిన సొమ్మును నెలసరి ఆదాయంగా ఐదేళ్ల పథకంలో పొదుపు చేస్తుంటారు. దీనిపై వచ్చే వడ్డీతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటుంటారు. వడ్డీరేటు తగ్గింపు ప్రభావం వీరిపై కూడా పడనుంది. తపాలా శాఖలో ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీరేట్లు మారుతుంటాయి. ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలవుతాయని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు.