జల్సాలకు అలవాటుపడి.. | Cannabis Sales In Tadepalli And Mangalagiri | Sakshi
Sakshi News home page

గంజాయి ఘాటు

Jun 29 2020 8:53 AM | Updated on Jun 29 2020 8:53 AM

Cannabis Sales In Tadepalli And Mangalagiri - Sakshi

సాక్షి, గుంటూరు: మత్తు పదార్థాలతో బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది. విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలై చేజేతులా జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. ఇందులో మైనర్లు అధికంగా ఉండటం కలవరపెడుతోంది. జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు కేంద్రాలుగా గంజాయి మాఫియా రెచ్చిపోతుంది. ఆయా ప్రాంతాల్లో గంజాయి విక్రయమే జీవనాధారంగా చేసుకుని పలువురు కార్యకలపాలు సాగిస్తున్నారు. ఇందులో అమాయక విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు. తొలుత వారికి గంజాయి రుచి రూపించి, దానికి బానిసలుగా మార్చి ఆ తర్వాత గంజాయి రవాణా, విక్రయాలకు వినియోగిస్తున్నారు.   

జల్సాలకు అలవాటుపడి.. 
కావాల్సినంత డబ్బు అందుబాటులో ఉండి జల్సాలకు అలవాటుపడిన కొందరు వైద్యులు, లెక్చరర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల పిల్లలు సైతం గంజాయికి బానిసలైన ఉదంతాలు జిల్లాలో అనేకం వెలుగు చూశాయి. గుంటూరు నగరం, శివారు ప్రాంతాలు, మంగళగిరి, తాడేపల్లి సహా పలు ప్రాంతాల్లో కాలేజీలు, హాస్టళ్ల సమీపంలో ఉన్న పాడుపడిన కట్టడాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో డెన్‌లను ఏర్పాటు చేసుకుని కొందరు యువత గంజాయి పీలుస్తున్నారు. గతంలో నిఘావర్గాలు వీటిని గుర్తించి పలువురిని అరెస్టు చేసిన ఘటనలున్నాయి. గుంటూరు నగరంలో అయితే మైనర్ల తల్లిదండ్రులు పోలీస్‌ అధికారులను ఆశ్రయించి తమ పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారని ఫిర్యాదు చేయడం గత ఏడాది కలకలం రేపింది.   

ఏజెన్సీ వయా విజయవాడ, ఇబ్రహీంపట్నం.. 
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా విజయవాడ, ఇబ్రహీంపట్నాలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం. 
అక్కడి నుంచి జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు నగరం సహా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు.  
చిన్న చిన్న పొట్లాలుగా గంజాయిని ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. వీటికి పావులుగా కాలేజీ విద్యార్థులనే ఉపయోగిస్తున్నారు. 
గతంలో రూ.300కు విక్రయించే గంజాయి ప్యాకెట్‌ ప్రస్తుతం రూ.500 విక్రయిస్తున్నట్టు సమాచారం.  
ఫోన్‌ చేసి అడ్రెస్‌ చెబితే బైక్‌లపై గంజాయిని డెలివరీ చేసే విధానం ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో నడుస్తోంది.  
ఈ తరహాలో గంజాయి రవాణా చేస్తూ తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో విద్యార్థులు అనేక సార్లు పట్టుబడ్డారు. 
మరోవైపు అమాయక మహిళల అవసరాలను ఆసరాగా తీసుకుని గంజాయి రవాణా, విక్రయాల్లోకి దించుతున్నారు. 
అయితే గంజాయి రవాణా, సరఫరా, విక్రయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తుల మూలలను ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలొస్తున్నారు.  

మూలాలను ఛేదిస్తాం.. 
గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. మూలలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాం. కాల్‌ డేటా, ఇతర డిజిటల్‌ ఆధారాల ద్వారా కీలక వ్యక్తులను అరెస్ట్‌ చేసి, జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల వద్ద సమాచారం ఉంటే ధైర్యంగా పోలీసులకు చెప్పాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. 
– ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, అర్బన్‌ ఎస్పీ  
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement