మాటిచ్చారు... మనసు దోచారు...  

Botsa Says CM YS Jagan Did Justice To Agrigold Depositors - Sakshi

అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు న్యాయం చేసిన సీఎం 

రూ. పదివేల లోపు డిపాజిట్‌ మొత్తాలు అందజేత 

జిల్లాలో 57,941 మందికి తొలివిడతగా ప్రయోజనం 

లబ్ధిదారుల కళ్లల్లో వెల్లివిరిసిన సంతోషం 

వారి కళ్లల్లో సంభ్రమాశ్చర్యాలు స్పష్టంగా కనిపించాయి. కలో నిజమో తెలియని ఓ సందిగ్ధావస్థ ప్రస్ఫుటమైంది. ఇక రాదేమో అనుకున్న మొత్తాలు బ్యాంకు ఖాతాల్లో జమయినట్టు వచ్చిన మెసేజ్‌తో వారి కళ్లల్లో ఆనందం సుస్పష్టమైంది. గత పాలకులు తీరని అన్యాయం చేసి మోసం చేస్తే... ప్రస్తుత పాలకులు ఇచ్చిన మాటకు కట్టుబడి పూర్తి న్యాయం చేశారు. సంకల్పయాత్ర సాక్షిగా ఇచ్చిన హామీ... పదవిలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే అమలు చేయడం చూసి వారి కళ్ల నుంచి అప్రయత్నంగా కొన్ని ఆనందబాష్పాలు మిలమిలా మెరిశాయి. 

సాక్షి, విజయనగరం: వారి కష్టం తీరింది. నిరీక్షణ ఫలించింది. ఇప్పటికి న్యాయం జరిగింది. రెక్కలు ముక్కలు చేసుకుని పైసాపైసా కూడబెట్టి వడ్డీలు వస్తాయనీ... తమ సమస్యలు తీరుతాయనీ... పిల్లల భవిష్యత్తుకు ఢోకా ఉండదనీ అగ్రిగోల్డ్‌లో సొమ్ము దాచుకుంటే అది కాస్తా బోర్డు తిరగేసేసింది. నెలలు... సంవత్సరాలు గడచిపోయాయి. గత సర్కారు చేసిన అన్యాయంతో ఇక సొమ్ము తిరిగి రాదనుకున్న తరుణంలో దేవుడిలా జగన్‌మోహన్‌రెడ్డి వారి ఆశలు తీర్చారు. డిపాజిట్‌ చేసిన మొత్తాలు తిరిగి చెల్లించారు. పదివేల రూపాయల లోపు డిపాజిట్‌ చేసినవారి మొత్తాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయించారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం జిల్లాకు చెందిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌లో దాచుకున్న మొత్తాలను వాపసు చేశారు. 

విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో కార్యక్రమానికి హాజరైన అగ్రిగోల్డ్‌ బాధితులు

రూ. 37 కోట్లు విడుదల
 ప్రజాసంకల్ప యాత్ర సాక్షిగా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దాని ప్రకారం అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే తొలివిడతగా రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన జిల్లాలోని 57,941 మందికి న్యాయం చేశారు. వారికోసం మంజూరు చేసిన రూ.36.99 కోట్లు విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన అగ్రిగోల్డ్‌ బాధితులతో రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా మాట్లాడారు. అందరూ నిజమైన లబ్ధిదారులేనా అని ఆరాతీస్తూ వారి మనసులోని భావాలను వెలికి తీసే యత్నం చేశారు. జరుగుతున్నదంతా ఒక కలలా ఉందని, డిపాజిట్లు తిరిగి వస్తాయనుకోలేదని, సీఎం జగన్‌ చల్లగా ఉండాలని దీవిస్తూ లబి్ధదారులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం అందించిన సాయంతో జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు సంబరాలు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు.
 
బాధితులతో మంత్రి బొత్స ముఖాముఖి 
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సమావేశానికి వచ్చిన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. వచ్చిన వారంతా... అగ్రిగోల్డ్‌ బాధితులేనా, లేక అధికారులు వేరెవరినైనా తీసుకువచ్చి షో చేశారా అని ప్రశ్నిస్తే... లేదనీ.. తామంతా ఖాతాదరులమేనని చేతులెత్తారు. అందులోని కొందరు మహిళలను వేదికపైకి పిలిపించుకుని ఎంతెంత మొత్తాలు డిపాజిట్‌ చేశారు...ఎన్నాళ్ల కాల వ్యవధికి డిపాజిట్‌ చేశారో అడిగి తెలుసుకున్నారు.
 
ఇదంతా సీఎం జగన్‌ చలవే... 
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ చిత్తశుద్ధితో నెరవేర్చారు. ఇదే విషయాన్ని మంత్రి బొత్ససత్యనారాయణ సభావేదికపైనుంచి చెప్పడమే గాకుండా... సీఎం చలవ వల్లే ఆ మొత్తాలు తిరిగి వచ్చేశాయని వివరించారు. అంతేగాకుండా ఏవైనా సాంకేతిక కారణాలవల్ల నగదు బ్యాంకు ఖాతాలో జమకాకుంటే కంగారు పడాల్సిన పనిలేదనీ, అందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top