‘బాస్’ టార్గెట్ 8

‘బాస్’  టార్గెట్ 8 - Sakshi


► 8 మంది ఎమ్మెల్యేల బాబు వ్యూహం

► టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం భారీ ఆపరేషన్

► ఎంత ఖర్చయినా పర్లేదంటూ టీటీడీపీ నేతలకు నిర్దేశం

► రేవంత్, ఎర్రబెల్లి, రమణ, సండ్రలకు బాధ్యతలు

► పలువురు ఎమ్మెల్యేలకు ఐదేసి కోట్లు ఆఫర్ చేసిన నేతలు

► సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన మజ్లిస్ ఎమ్మెల్యే బలాల

► అప్రమత్తమైన టీఆర్‌ఎస్ వర్గాలు.. మంత్రి హరీశ్‌కు చెప్పిన స్టీఫెన్‌సన్

 ► ఏసీబీ రంగప్రవేశంతో బెడిసికొట్టిన చంద్రబాబు పథకం

 ► ఎర్రబెల్లి, రమణ, సండ్ర పాత్రపైనా విచారణ


 సాక్షి, హైదరాబాద్: ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారీ ఆపరేషన్‌కు రూపకల్పన చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే టీడీపీ అభ్యర్థికి కనీసం 21 ఓట్లు పోలయ్యేలా వ్యూహరచన చేశారు. ఎంత ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆపరేషన్ నిర్వాహకులకు(టీటీడీపీ నేతలకు) భరోసా ఇచ్చారు. ‘బాస్’ ఆదేశాల మేరకు తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సండ్ర వెంకటవీరయ్య రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలను గుర్తించి వారితో మాట్లాడే బాధ్యతను తీసుకున్నారు. టీడీపీకి మద్దతిచ్చేందుకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలతో రాయ‘బేరాలు’ నడిపారు. వీరిలో ఐదుగురు ఓటేసినా, మరో ఐదుగురు బీజేపీ సభ్యులతో కలిపి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి 21 ఓట్లు వస్తాయన్నది పార్టీ నేతల యోచన.అదే సమయంలో మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి) టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ బలం 11 నుంచి 10కి తగ్గింది. ఈ లెక్కన 20 ఓట్లు వచ్చినా చాలునని టీడీపీ అధినేత భావించారు. దీనికి అనుగుణంగా టీటీడీపీ నేతలు వ్యవహరించారు. తమ సొంత జిల్లాల్లో పరిచయమున్న ఎమ్మెల్యేలతో నేరుగానో లేక వారి సన్నిహితులను ఆసరాగా చేసుకునో మంతనాలు జరిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే భారీ నజరానా ఉంటుందన్న సమాచారం పంపారు. ఏపీ సీఎం చంద్రబాబే డబ్బును సమకూర్చుతారని, అక్కడ అధికారంలో ఉన్నందున డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదని మధ్యవర్తులకు నమ్మకంగా చెప్పారు. అవసరమైతే కొంత సొమ్మును ముందే సర్దుతామని హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి తీసుకువచ్చిన అహ్మద్ బలాల

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే భారీగా డబ్బు ముట్టజెప్పుతామని ఆ పార్టీ నేతలు మధ్యవర్తుల ద్వారా ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని హైదరాబాద్‌లోని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల... ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దృష్టికి తెచ్చారు. రేవంత్‌రెడ్డి తరఫున ఓ మధ్యవర్తి తనను సంప్రదించాడని బలాల తెలిపారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్.. పోలింగ్‌కు మూడు రోజుల ముందు(మే 29న) టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఎవరి పేరునూ  ప్రస్తావించకుండానే పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా అనైతిక పనులకు పాల్పడితే అసెంబ్లీని రద్దు చేయడానికి కూడా వెనుకాడబోనని సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అలాగే బలాల ఇచ్చిన సమాచారం మేరకు అనుమానం ఉన్న ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాలని తనకు అత్యంత నమ్మకస్తులైన మంత్రి హరీశ్‌తోపాటు మరొకరిని కేసీఆర్ ఆదేశించారు. అదే సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఆపరేషన్‌పై అనుమానం వచ్చింది. వెంటనే ఆయన ఈ వ్యవహారాన్ని హరీశ్‌రావుకు వివరించారు. రేవంత్‌రెడ్డి తనకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. అవినీతి నిరోధక శాఖ చీఫ్ ఖాన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఇతరుల పేర్లు

  స్టీఫెన్‌సన్ తెలిపిన వివరాలను హరీశ్‌రావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీడీపీ ఆపరేషన్ భారీ స్థాయిలో జరుగుతోందన్న నిర్ధారణకు కేసీఆర్ వచ్చారు. రేవంత్‌రెడ్డి-స్టీఫెన్‌సన్ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూనే టీడీపీ నేతలు సంప్రదిపంపులు జరుపుతున్న ఇతర ఎమ్మెల్యేలను కూడా గుర్తించారు. అత్యంత విశ్వసనీయవర్గాలు అందించిన సమాచారం ప్రకారం టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపిన వారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంజీవరావు(వికారాబాద్), బి.శోభ(చొప్పదండి), శంకర్ నాయక్(మహబూబాబాద్)తోపాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మదన్‌లాల్(వైరా), తాటి వెంకటేశ్వర్లు(అశ్వరావుపేట), కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన కనకయ్య(ఇల్లెందు) ఉన్నారు. వీరందరికీ రూ.5 కోట్ల చొప్పున ఇస్తామని నేరుగా వారికో లేక వారికి సన్నిహితులైన వారికో టీడీపీ నేతలు హామీ ఇచ్చినట్లు సమాచారం.కాగా, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన నలుగరు టీడీపీ నేతల్లో ఒకరైన రేవంత్‌రెడ్డి ఇప్పటికే అరెస్ట్ కాగా, మిగిలిన ముగ్గురు నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సండ్ర వెంకట వీరయ్య పాత్రపైనా వారి కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. నాలుగు రోజుల కస్టడీలో రేవంత్ వెల్లడించే వివరాల ఆధారంగా తదుపరి విచారణ ఉంటుందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top