మరో నెలలో వీడనున్న ‘చంద్ర’గ్రహణం

B Y Ramaiah Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు : అహంకారంతో విర్రవీగిన చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారని చంద్రబాబు కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోందని కర్నూల్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య అన్నారు. కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మరో నెలరోజుల్లో చంద్రగ్రహణం వీడనుందని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేని చంద్రబాబు ఓటు వేసిన ప్రజలనే అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఈవీఎంలపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని.. తనకు మంచి జరిగితే.. అంతా సక్రమం లేకపోతే అక్రమం అన్న రీతిలో చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం ఉట్టికి ఎగరేలనమ్మ.. స్వర్గానికి ఎగురుతా అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు చంద్రబాబు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని, ఈవీఎంలపై, ఈసీలపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ఏపిలో వైఎస్‌ జగన్‌ చేతిలో ఓటమి ఖరారైనా.. దాన్ని అంగీకరించకపోవడం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. నేడు ప్రజాతీర్పు వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా ఉండటంతో ఈసీ పైనే చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్సార్‌సీపీ పక్షాన నిలిచారని పేర్కొన్నారు. మార్పు కోసం మహిళలు, వృద్దులు, యువకులు, దిగువ మధ్య తరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కసితో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వైఎస్సార్‌సీపీ ధన్యవాదాలు తెలుపుతోందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో రాజన్న పాలనను జగనన్న అందించబోతున్నారని తెలిపారు. 

ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై ప్రజలు పూర్తి నమ్మకం ఉంచారని అన్నారు. రాష్ట్రంలో ఫ్యాన్‌ గాలి బలంగా వీస్తోందని.. 130 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు గెలవబోతోందని అన్నారు. కర్నూలులో 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో జనసేన కార్యాలయాలకు టులెట్‌ బోర్డులు పెట్టారని, మే 23 తరువాత టీడీపీ కూడా ఖాళీ అవ్వడం తథ్యమన్నారు. ఈ సమావేశంలో కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డా. సంజీవ్ కుమార్, కోడుమూరు అభ్యర్థి డా. సుధాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top