జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి, తదితరులు చేపట్టిన దీక్ష కొనసాగుతోంది.
సాక్షి, కడప: జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన ఆమరణ దీక్షలు ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి, తదితరులు చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. ఉద్యోగులు, విద్యార్థులతోపాటు అన్ని వర్గాల ప్రజలు, అన్ని సంఘాలు వేలాది మందిగా తరలివచ్చి వీరి దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ దీక్షలు ఉద్యమానికి మరింత ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తోంది.
ఈమె దీక్షకు మద్దతుగా పులివెందుల పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత ఈసీ గంగిరెడ్డి రిలే దీక్షలను ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రిలే దీక్షలు సాగుతున్నాయి. ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో మహిళలు రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. దీంతోపాటు స్వచ్ఛందంగా పలుచోట్ల విజయమ్మ దీక్షకు సంఘీభావాన్ని తెలుపుతూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్షలు మంగళవారంతో ఏడవరోజు పూర్తయ్యాయి.
వీరికి షుగర్, సోడియం లెవెల్స్ తగ్గడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వీరి దీక్షలకు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, నేషనల్ టూరిజంశాఖ డెరైక్టర్ సురేంద్రకుమార్‌లు సంఘీభావం తెలిపారు. కాగా మంగళవారం రాత్రి ఆకేపాటి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
కడప కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడువైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, నాగిరెడ్డిల దీక్ష మంగళవారంతో రెండవరోజు పూర్తి చేసుకుంది. వీరి దీక్షలకు సంఘీభావంగా పెద్ద ఎత్తున యువతతోపాటు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. వీరి దీక్షలకు వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, డీసీఎంఎస్‌మాజీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు సంఘీభావం తెలిపారు.