అవనిగడ్డ ఉప ఎన్నిక | AVANIGADDA By-election | Sakshi
Sakshi News home page

అవనిగడ్డ ఉప ఎన్నిక

Aug 22 2013 1:15 AM | Updated on Aug 21 2018 5:44 PM

అనుకున్నట్టే అయ్యింది. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలోనే అతి తక్కువ పోలింగ్ బుధవారం నాటి ఉప ఎన్నికల్లో నమోదైంది.

సాక్షి, మచిలీపట్నం / చల్లపల్లి న్యూస్‌లైన్ : అనుకున్నట్టే అయ్యింది. అవనిగడ్డ నియోజకవర్గ చరిత్రలోనే అతి తక్కువ పోలింగ్ బుధవారం నాటి ఉప ఎన్నికల్లో నమోదైంది. సమైక్య సెగ, మాగాణి పనులు, ప్రధాన పార్టీల పోటీ లేకపోవడం, కాంగ్రెస్ ఎన్నికల బహిష్కరణ పిలుపుతో కేవలం 47.01 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా ఓటర్ల కంటే పోలీసుల సంఖ్యే ఎక్కువగా కనిపించింది. మొత్తానికి అవనిగడ్డ ఉప పోరు ప్రశాంతంగా ముగిసింది. 1967లో ఏర్పడిన     ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12 పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి.

గతంలో జరిగిన ఎన్నికలను పరికిస్తే 58 శాతం ఓటింగ్‌తో అతి తక్కువ పోలింగ్ జరిగినట్టు రికార్డు ఉంది. దాన్ని తలదన్నేలా ఈసారి ఉప ఎన్నికల్లో కేవలం 47.01 శాతం పోలింగ్‌కే పరిమితమైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలవ్వగా పది గంటల సమయంలో కేవలం 7 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. అనంతరం 12 గంటల సమయంలో 19 శాతం, రెండు గంటల సమయంలో 31 శాతం, 4 గంటల సమయంలో 36 శాతం, ఐదు గంటలకు 47.01 శాతం పోలింగ్ జరిగింది. చివరి ఒక్క గంటలో సుమారు 11 శాతం నమోదవడం విశేషం.

ఓటింగ్ శాతం తగ్గడంతో కంగారుపడిన తెలుగుదేశం శ్రేణులు గ్రామాల్లోకి వెళ్లి తమకు అనుకూలంగా ఉండే ఓటర్లను స్వయంగా తీసుకుని వచ్చి ఓటింగ్ చేయించుకోగలిగారు. దీంతో చివరి నిమిషంలో ఓటింగ్ శాతం ఒక మేరకు పెరిగింది. నియోజకవర్గంలో మొత్తం 1,88,300 మంది ఓటర్లు ఉంటే వారిలో 88,682 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జేసీ పి.ఉషాకుమారి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్.రమేష్‌కుమార్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు ఉప ఎన్నికలను పర్యవేక్షించారు.
 
ముప్పేట దాడి..
 ముందు నుంచి అనుకున్నట్టే అవనిగడ్డ ఉప ఎన్నికలపై మూడు ప్రధాన అంశాలు ప్రభావం చూపించాయి. తొలి నుంచి మూడు అంశాలు తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాయి. వాటిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో లేకపోవడం ఒకటి, సమైక్యాంధ్ర ఉద్యమం మరొకటి, మాగాణి సాగు పనులు ముమ్మరంగా సాగడం ఇంకొకటి. ప్రధాన పార్టీలు పోటీ చేయడం లేదని ప్రకటించడం, సానుభూతితో టీడీపీకి ఏకగ్రీవం అవుతుందనుకున్న తరుణంలో స్వతంత్రులు ఇద్దరు బరిలో నిలవడంతో పోటీ తప్పలేదు.

ప్రధాన పార్టీలు లేకపోవడంతో ఎన్నికలను ఓటర్లు అంత సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో ఓటింగ్‌కు ఎక్కువమంది దూరంగానే ఉన్నారు. పోటీలో లేని కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే సమైక్యాంధ్ర నినాదంతో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునివ్వడం కూడా కొంత ప్రభావం చూపింది. అవనిగడ్డ నియోజకవర్గంలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను సాగు పనులు ముమ్మరంగా సాగడంతో రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తానికి డబ్బు, మద్యం ప్రలోభాల వల గట్టిగా విసరని ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు సైతం అంతే నిరాసక్తి చూపించారన్నది కొసమెరుపు.
 

Advertisement
 
Advertisement
Advertisement