రాజధానిలో హింసకు కుట్ర!

Attackers Target Media Persons Is Not Accidental! - Sakshi

జర్నలిస్టులపై దాడి యాదృచ్ఛికం కాదు 

రైతుల ముసుగులో అసాంఘిక శక్తుల పనే అంటున్న నిఘా వర్గాలు 

 సాక్షి, అమరావతి : రైతుల ముసుగులో అసాంఘిక శక్తులను రంగంలోకి దించి అమరావతిలో హింసాత్మక ఘటనలకు పాల్పడే కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్‌ చేసేందుకు శుక్రవారం వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడకు వచ్చిన బయట వ్యక్తులు కొందరు పరుష పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటం వెనుక రైతుల ముసుగులో వచ్చిన టీడీపీ సానుభూతిపరుల హస్తం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. నిరసన కార్యక్రమాలను స్థానికులు పట్టించుకోకపోవడంతో టీడీపీ, దాని మద్దతుదారులు పనిగట్టుకుని కార్లలో జనాన్ని తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా రెచ్చగొట్టే చర్యలకు, ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషలాడుతున్నా చూసీచూడనట్లు వదిలేశారు. 

దీనిని అలుసుగా తీసుకున్న కొందరు హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నినట్లు జర్నలిస్టులపై దాడి ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జర్నలిస్టులపై దాడి ఘటనను వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ ఖండించారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కె.రాజేశ్వరరావు ఖండించారు.  మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తెలిపారు. రైతుల ముసుగులో బయట వ్యక్తులే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. 

దాడుల వెనుక టీడీపీ!?
సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌తో చేపట్టిన  ఆందోళనలు ప్రశాంతంగానే కొనసాగుతున్నా.. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌనదీక్షను కవర్‌ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడుల వెనుక టీడీపీ కుట్ర ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘కన్నా’ దీక్ష చేసిన రోజే దాడులకు ఎందుకు తెగబడ్డారు.. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు 
కమలం పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

బీజేపీపై నెపం నెట్టే విధంగా టీడీపీ హింసాత్మక ఘటనలకు ఏమైనా ప్రేరేపించిందా అని వారు చర్చించుకుంటున్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద కన్నా చేపట్టిన దీక్షాస్థలి సమీపంలోనే మీడియాపై మూకదాడికి పాల్పడిన వారు టీడీపీ సానుభూతిపరులే అనే వారు చెబుతున్నారు. టీడీపీ పెద్దలు వ్యూహాత్మకంగానే ఇలాంటి ఘటనలకు ప్రణాళిక రచించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.    

మోదీ మాస్కులతో ఎందుకు? 
దీనికితోడు.. ఆర్నెల్ల క్రితం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా టీడీపీ నాయకులు, పెద్దలు నల్ల జెండాలు పట్టుకుని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు మాస్కుల్లేకుండా మోదీ మాస్కులు ధరించడం దురుద్దేశంతో కూడుకున్నదేనని కూడా ఆక్షేపిస్తున్నారు. ఇది టీడీపీ పెద్దల పక్కా ప్రణాళికలో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: వెంబడించి మరీ దాడి చేశారు : జర్నలిస్టులు

రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top