స్వాతి సన్‌సోర్స్‌కు షాక్‌

APIIC Officers Issued Notices To Swathi Sunsource Power PVT LMD - Sakshi

భవన నిర్మాణాలన్నీ అక్రమమే 

నోటీసులు జారీ చేసి అక్రమ కట్టడాలను తొలగిస్తాం 

పీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపీకృష్ణ స్పష్టం 

సాక్షి, అనంతపురం : పరిశ్రమ పేరుతో కారుచౌకగా ప్రభుత్వ భూములు కొట్టేసి.. ఆ స్థలాలను ఇతరులకు లీజుకిచ్చిన ‘స్వాతి సన్‌సోర్స్‌’ పరిశ్రమ నిర్వాహకులకు ఏపీఐఐసీ అధికారులు షాక్‌ ఇచ్చారు. పరిశ్రమ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారని, వాటిని ఎందుకు కూల్చకూడదో చెప్పాలని పరిశ్రమ నిర్వాహకునికి నోటీసులు జారీ చేశారు. 

సాక్షి కథనంతో అధికారుల్లో కదలిక 
స్వాతి సన్‌సోర్స్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిశ్రమ పేరుతో ఏపీఐఐసీ నుంచి తీసుకున్న స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా భవంతులు నిర్మిస్తున్న వైనంపై ‘అవినీతి వెలుగులు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జోనల్‌ మేనేజర్‌ గోపీకృష్ణ గురువారం పెనుకొండ సమీపంలోని స్వాతి సన్‌ సోర్స్‌ పరిశ్రమను పరిశీలించారు. ఏపీఐఐసీ నుంచి కేవలం ఒక భవన నిర్మాణానికే అనుమతులు తీసుకొని అపార్ట్‌మెంట్లు ఎలా నిర్మిస్తారని పరిశ్రమ నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు తీసుకున్న స్థలాలను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమన్నారు. పరిశ్రమను నెలకొల్పి కార్మికులకు ఉపాధి కల్పించాల్సింది పోయి.. అక్రమంగా భవంతులను నిర్మించి అద్దెలకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చకూడదో సమాధానం చెప్పాలని నోటీసులను జారీ చేశారు. నిర్వాహకుడి నుంచి జవాబు రాగానే 15 రోజుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top