హోదా ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు

Ap Special Status Of The Nagelancy Cm Chandrababu - Sakshi

సీఎం చంద్రబాబునాయుడిపై మండిపడ్డ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి 

రాష్ట్రం అట్టుడికిపోతుంటే సింగపూర్‌కు ఎందుకంటూ ఆగ్రహం

ఈనెల 16న రాష్ట్ర బంద్‌కు సహకరించాలని ప్రజలకు పిలుపు

ఉరవకొండ : రాష్ట్రంలో హోదా కోసం బంద్‌లు, ధర్నాలు చేయడం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని సీఎం చంద్రబాబు మాట్లాడటం అన్యాయమని, అది ప్రజా పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా శుక్రవారం ఉరవకొండలో చేపడుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్‌ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అమరావతిలో ఆనంద నగరం కార్యక్రమం చేపట్టారన్నారు. హోదా కోసం ఈనెల 16న హోదా సాధన సమితి అధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బంద్‌ను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు.

ఇప్పటివరకు హోదా కోసం టీడీపీ వారు చేసిన ఆందోళనలు టీవీలు, పేపర్లలో తప్ప రోడ్లపై కన్పించలేదన్నారు. నాలుగేళ్లుగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో హడావిడి చేస్తున్నా నేటికీ అమరావతి డిజైన్లు కార్యరూపం దాల్చలేదన్నారు. కేవలం సింగపూర్, మలేషియా అంటూ చంద్రబాబు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ 14 రోజులపాటు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడితే కేంద్రం 15 నిమిషాలు కుడా దానిపై చర్చించలేకపోయిందన్నారు. పార్లమెంట్‌ను స్తంభింప చేయడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుశీలమ్మ, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top