మన రాష్ట్రంలో పరిస్థితి మెరుగు

AP reaches a capacity of 30 thousand Corona tests per day - Sakshi

అత్యధిక ఇన్ఫెక్షన్‌ ఉన్న జిల్లాలు ఏపీలో లేవు 

తమిళనాడులోని వెల్లూరులో అత్యధిక ఇన్ఫెక్షన్‌  

రోజుకు 30 వేల టెస్టుల సామర్థ్యాన్ని చేరుకున్న ఏపీ

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉధృతి ఊహించనంతగా పెరిగింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లా, కర్ణాటకలోని బెంగళూరు వంటి చోట్ల భారీగా కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం కరోనా వ్యాప్తి భారీగా పెరిగినట్టు ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌) అధికారులు చెబుతున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నియంత్రణలో ఉందని, అయినా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే వైరస్‌ను మరింతగా కట్టడి చేయొచ్చని  వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో కంటే ఇప్పుడే ఎక్కువ జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని, వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారిని అస్సలు బయటకు రానివ్వొద్దంటున్నారు. జూన్‌ 15 వరకూ పెరుగుదల ఓ మోస్తరుగా ఉన్నా ఆ తర్వాత కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఏపీలో గడిచిన 15 రోజుల్లోనే 48.6 శాతం కేసులు నమోదయ్యాయి. సోమవారం నాటికి రాష్ట్రంలో 13,891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ నియంత్రణకు టెస్టుల సంఖ్య మరింతగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రోజుకు 30 వేల టెస్టుల లక్ష్యం దాటిన సంగతి తెల్సిందే.  

ఇన్ఫెక్షన్‌ రేటులో వెల్లూరు టాప్‌ 
దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లో తమిళనాడులోని వెల్లూరు మొదటి స్థానంలో ఉంది. బెంగుళూరు రెండో స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉంది.  ఇక్కడ అత్యధికంగా కేసులు నమోదవుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఒకేరోజు 30,216 కరోనా పరీక్షలు
ఏపీ ప్రభుత్వం ఒకే రోజు మరోసారి 30,000పైగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 24న 36,047 పరీక్షలు నిర్వహించడం ద్వారా ఒకే రోజు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 వరకు 30,216 పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలు 8,72,076కి చేరాయి. ప్రతి పది లక్షల జనాభాకు సగటున 16,330 మందికి పరీక్షలు నిర్వహిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 793 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది. తాజాగా ఆస్పత్రుల నుంచి 324 మంది డిశ్చార్జ్‌ కావడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,232కి చేరింది. 24 గంటల్లో 11 మంది మరణించడంతో మొత్తం మరణాలు 180కి చేరాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 7,479 ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top