మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు

AP Government Preparation For Local Body Elections - Sakshi

వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికల్లా రిజర్వేషన్ల ఖరారు పూర్తి

జనవరి 10వ తేదీకల్లా వివరాలను ఎన్నికల సంఘానికి పంపుతాం

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కంటే ముందు పూర్తి చేయాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టు ముందుంచింది. 2020 జనవరి మొదటి వారం నాటికి పంచాయతీల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలను పూర్తి చేస్తామని నివేదించింది. జనవరి 10వ తేదీ కల్లా ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపుతామంది. మార్చి 31వ తేదీకల్లా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామని వివరించింది. ఈ వివరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జనవరి 3వ తేదీ కల్లా పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసి, వీలైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా, ప్రత్యేకాధికారులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరో వ్యక్తి కూడా పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యాలపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా  సీఎస్‌  నీలం సాహ్ని దాఖలు చేసిన అఫిడవిట్‌ను అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ ధర్మాసనం ముందుంచారు. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటూ 2018 అక్టోబర్‌ 23న ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేకపోయినందుకు నీలం సాహ్ని కోర్టును క్షమాపణలు కోరారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏజీ శ్రీరామ్‌ వివరించారు. జనవరి మొదటి వారానికల్లా పంచాయతీల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేస్తామని తెలిపారు. జనవరి 10కల్లా ఆ రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియచేస్తామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top