కష్టాల వేళ.. సర్కారు చేయూత | AP CM YS Jagan Mohan Reddy Released Financial Aid For Flood Victims | Sakshi
Sakshi News home page

కష్టాల వేళ.. సర్కారు చేయూత

Sep 13 2019 10:32 AM | Updated on Sep 13 2019 10:32 AM

AP CM YS Jagan Mohan Reddy Released Financial Aid For Flood Victims - Sakshi

సాక్షి, కాకినాడ :  గోదావరి వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది.  ఉపాధి కోల్పోయి, ఇంటికే పరిమితమైన కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి రూ.5000 చొప్పున 14,435 కుటుంబాలకు రూ.7,21,75,000 విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులందాయి. ఆర్థిక సాయం పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అకౌంట్ల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రెండు రోజుల్లో నగదు జమయ్యే అవకాశం ఉంది.

ఇచ్చిన మాటకు కట్టుబడి..
వరద ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను  అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను గత నెల 8వ తేదీన ఆయన స్వయంగా ఏరియల్‌ సర్వే చేసి వరద ముంపులో బిక్కుబిక్కుమంటూ గడిపిన బాధితులకు ‘నేనున్నా’నంటూ భరోసా ఇచ్చారు. విదేశాల్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా జిల్లాలో గోదావరి వరద బాధితులను కంటికి రెప్పలా చూసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో బాధితులకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చారు. పరిస్థితిపై ఆరా తీసేందుకు మూడుసార్లు మంత్రుల బృందాన్ని క్షేత్రస్థాయికి పంపించారు. అనంతరం రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

వరద తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మన్యంలో వరద పరిస్థితి, అందుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురికాకుండా పునరావాస కేంద్రాల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులను ఆదేశించారు. వరదల్లో నష్టపోయిన వారికి సాయంగా రూ.5 వేలు, రవాణా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో వంతున పప్పులు, నూనె వంటి నిత్యావసరాలు యుద్ధప్రాతిపదికన సరఫరా చేశారు.

రూ.7.21 కోట్ల సాయం విడుదల
గోదావరి వరద ప్రభావిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేసింది. జులై 30 నుంచి ఆగస్టు 12 వరకు సంభవించిన వరదల్లో వారం రోజులకుపైగా నీటిలో చిక్కుకున్న 14,435 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.7,21,75,000 ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఇందులో ఎటపాక డివిజన్‌లో పరిధిలో 9,321 కుటుంబాలకు, రంపచోడవరం 5,000, అమలాపురం 55, రామచంద్రపురం డివిజన్లలో 59 కుటుంబాలకు సాయం అందనుంది. ఇప్పటికే 49,380 కుటుంబాలకు 12,345 క్వింటాళ్ల బియ్యం, 493 క్వింటాళ్ల కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, 49,380 లీటర్ల వంటనూనె, 1,46,313 లీటర్ల కిరోసిన్‌ ఇప్పటికే పంపిణీ చేశారు.గతానికి భిన్నంగా నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వంద శాతం సబ్సిడీతో పంట సాగుకు విత్తనాలు సరఫరా చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

గత టీడీపీ హయాంలో మొక్కుబడి తంతు
టీడీపీ ప్రభుత్వ హయాంలో విపత్తులు ఎదురైనప్పుడు కేవలం ఐదు కిలోల బియ్యం, మొక్కుబడిగా కిరోసిన్‌ ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి ఉండేది. 50 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించేవారు. గతానికి భిన్నంగా నిర్వాసితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వంద శాతం సబ్సిడీతో పంట సాగుకు విత్తనాలు సరఫరా చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

పారదర్శక పంపిణీకి శ్రీకారం
వరద బాధితులకు సాయం సొమ్ము నేరుగా అందేలా చర్యలు తీసుకోనున్నారు. మధ్యవర్తులు, దళారులకు ఆస్కారం లేకుండా బాధితుడికి అందజేసేందుకు శ్రీకారం చుట్టారు. బాధితుడి బ్యాంక్‌ ఖాతాలో నేరుగా సాయం సొమ్ము జమ చేస్తున్నారు. ఇందుకు అవసరమైన బ్యాంక్‌ ఖాతాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. 

బాబు హయాంలో...
వరదలు వచ్చే సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేతల్లో కన్నా అనవసర హడావుడే ఎక్కువగా కనిపించేది. వరద నష్టంకన్నా ప్రచారానికే అధిక వ్యయమయ్యేది. అంతా తానే చేస్తున్నట్టుగా మీడియాలో ప్రచారం కల్పించి బాధితులకు మొండిచేయి చూపించేవారు. ఇస్తే...గిస్తే ఐదు కిలోల బియ్యం, మొక్కుబడిగా కిరోసిన్‌ అందజేసి చేతులు దులుపుకొనేవారు. విత్తనాలు అరకొరగా అందించేవారు.  

జగన్‌ పాలనలో...
జిల్లాలో ఏ ఉపద్రవం వచ్చినా  ప్రాథమికంగా అధికార యంత్రాంగం, మంత్రుల సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అధినేత దిశా నిర్దేశంతో అమలు చేయాలి... బాధితులను ఆదుకోవాలి. అదే చేశారు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి. 14,435 బాధిత కుటుంబాలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా అన్నమాటకు అనుగుణంగా రూ.7,21,75,000 మంజూరు చేశారు.

బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తాం
గోదావరి వరద ప్రభావిత బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసింది. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వరద ప్రభావానికి నష్టపోయిన కుటుంబాలను గుర్తించాం. వారి బ్యాంకు ఖాతా నెంబర్ల సేకరణ ప్రక్రియకు నాంది పలికాం. సొమ్ము పక్కదారి పట్టకుండా నేరుగా చర్యలు తీసుకుంటున్నాం. సాయం సొమ్ము నేరుగా బాధితుడి ఖాతాల్లోనే జమ చేస్తాం. మరో రెండు రోజుల్లో సాయం అందే అవకాశం ఉంది.
– మురళీధర్‌రెడ్డి, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement