దిశ చట్టం విప్లవాత్మకం

AP CM YS Jagan Comments On AP Disha Bill In Assembly - Sakshi

అత్యాచారం ఆలోచన వస్తే.. వెన్నులో వణుకు పుట్టాలి

‘దిశ’ ఘటనల్ని వారం తర్వాత మర్చిపోయే పరిస్థితి ఉండకూడదు

వేగవంతమైన దర్యాప్తు, విచారణ.. సత్వర తీర్పుతోనే వీటి నియంత్రణ సాధ్యం

ఈ చట్టంపై దేశమంతా చర్చ జరిగి మిగతా రాష్ట్రాలూ ఆలోచిస్తాయి

‘ఏపీ దిశ చట్టం’పై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ఏపీ దిశ’ చట్టం విప్లవాత్మకమని, మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన రాగానే వెన్నులో వణుకు పుట్టించేలా రాష్ట్రంలో ఈ చట్టం తీసుకొచ్చామని.. ప్రతి మహిళకు భద్రత, భరోసా కల్పిస్తూ దీన్ని రూపొందించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు వేగవంతమైన దర్యాప్తు, విచారణ నిర్వహించి.. శిక్ష ఖరారు చేసినప్పుడు మాత్రమే నేరాల నియంత్రణ సాధ్యమని ఆయన చెప్పారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాల నిరోధానికి, సత్వర న్యాయం కోసం రూపొందించిన ‘ఏపీ దిశ’ బిల్లుపై శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. దిశ చట్టం విప్లవాత్మక నిర్ణయమని, దీనిపై దేశమంతా చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు.

ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ఒక వారం తర్వాత మర్చిపోవడం కాకుండా, ఘటన తమ ఇంట్లో జరిగితే ఎలా ఉంటుందన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని... అలాంటి ఆలోచన నుంచే ‘దిశ చట్టం’ పుట్టిందని సీఎం వివరించారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న భారత శిక్షా స్మృతి(ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) క్రిమినల్‌ ప్రక్రియ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని, దిశ చట్టంలో చేస్తున్న సవరణలు రాష్ట్రపతి వరకు వెళ్తున్నందున దేశమంతా తెలిసి చర్చ జరుగుతుందని.. ఆ దిశగా మిగతా రాష్ట్రాలు ఆలోచించేందుకు మనం శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ కొత్త చట్టంతో నేరం జరిగిన తర్వాత ఏడు పని దినాల్లోనే సాక్ష్యాధారాల సేకరణతో పాటు, కేసు దర్యాప్తు పూర్తి కావాలని, ఆ తర్వాత 14 పని దినాల్లో విచారణ పూర్తై దోషులకు ఉరిశిక్ష పడుతుందని వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే...

ఎక్కడైనా తప్పు జరిగితే వారం పాటు అందరం మాట్లాడతాం. ఆ తర్వాత మర్చిపోతాం. అలాంటి పరిస్థితి ఉండొద్దు. మన ఇంట్లో అలాంటి ఘటనలు జరిగితే ఒక తండ్రి, ఒక అన్న, ఒక తమ్ముడు ఎలా ఫీలవుతాడన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆ ధోరణితో చూసినప్పుడే ఇలాంటి నేరాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశలోనే నేను ఆలోచించాను.. అందుకే ఈ దిశ చట్టం తీసుకొస్తున్నాం.

ఈ నేరాలకు ముగింపు పలికేందుకే..
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఈ ఘటనల్ని చూస్తూ ఊరుకోకుండా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ముందడుగులు వేశాం. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి.. 2014లో 13,549 కేసులు నమోదు కాగా, 2015లో 13,088, 2016లో 13,948, 2017లో 14,696, 2018లో 14,048 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యాచార కేసులు 2014లో 937, 2015లో 1,014, 2016లో 969, 2017లో 1,046, 2018లో 1,096 నమోదయ్యాయి. చిన్నపిల్లలకు సంబంధించి చాలా ఎక్కువ నేరాలు జరిగాయి. బాలికలపై అత్యాచారాలు, నేరాలకు సంబంధించి 2014లో 4,032 కేసులు, 2015లో 4,114, 2016లో 4,477, 2017లో 4,672,  2018లో 4,215 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే, అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే అయినా, పరిస్థితి మార్చాలనుకున్నాం. అందుకోసం విప్లవాత్మక నిర్ణయాలు, చర్యలకు శ్రీకారం చుట్టాం.   

హ్యాట్సాఫ్‌ టు తెలంగాణ పోలీస్‌..
ఇటీవల తెలంగాణలో 26 ఏళ్ల వయసున్న వైద్యురాలిపై టోల్‌గేట్‌ సమీపంలో జరిగిన దారుణం చూశాం. అత్యాచారం చేయడంతో పాటు, అన్యాయంగా కాల్చేశారు. మనకూ పిల్లలు ఉన్నారు. అక్కా చెల్లెమ్మలు ఉన్నారు. మనిషి రాక్షసుడిగా మారినప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులను ఏం చేసినా తప్పులేదని సమాజానికి అనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే.. ఏదైనా జరగాలని అందరూ అన్నారు. సినిమాల్లో అయితే హీరో తుపాకీతో కాల్చేస్తే మనమంతా చప్పట్లు కొడతాం. బాగా చేశారనుకుంటాం. ‘దిశ’ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలని, కఠినమైన చర్య తీసుకుంటే ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్‌ పడుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కానీ, అక్కడి పోలీసులు వ్యవహరించారు. ఈ సభలో నేను మరోసారి చెబుతున్నా.. ‘హ్యాట్సాఫ్‌ టు తెలంగాణ పోలీస్‌. హ్యాట్సాఫ్‌ టు కేసీఆర్‌..   

నిర్భయ చట్టంతో ఏం న్యాయం జరిగింది
ఆ పరిస్థితి నుంచి నిజంగా మార్పు రావాలంటే ఏం జరగాలి? ఏం చేయాలి? న్యాయపరంగా ఏది సరైంది? న్యాయపరంగా ఏం చేయాలి? అన్న ఆలోచనల నుంచి పుట్టిందే దిశ చట్టం. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ప్రతి మనిషిలోనూ కలిగే స్పందన ఏంటంటే.. న్యాయం జరగాలి, త్వరగా న్యాయం జరగాలని అనిపిస్తుంది. రేపొద్దున ఈ సంఘటన మన పిల్లలకు కానీ, చెల్లెళ్లకు కానీ జరిగితే ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా భావించేది ఏంటంటే, నేరం చేసిన ఆ రాక్షసులకు శిక్ష త్వరగా పడాలని చెప్పి ఎదురు చూస్తారు. ఇవాళ అందుకు భిన్నంగా జరుగుతోంది. ఏడేళ్ల క్రితం నిర్భయ ఘటన జరిగినప్పుడు ‘నిర్భయ’ పేరిట ఏకంగా ఒక చట్టమే తీసుకువచ్చాం. ఆ చట్టం తీసుకొచి్చన తర్వాత కూడా ఏమైంది? ఏడేళ్లు దాటినా కూడా, అంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసినా కూడా, వాళ్లకు ఎలాంటి శిక్ష పడని పరిస్థితి. అలాంటప్పుడు దేశంలో ఉన్న ఈ న్యాయవ్యవస్థ మీద ఎవరికైనా, ఎక్కడైనా నమ్మకం ఎలా వస్తుంది?.   

ప్రత్యేకంగా 13 కోర్టులు ఏర్పాటు
మహిళలు, బాలికలపై అత్యాచారాలు, అఘాయిత్యాల కేసులకు సంబంధించి విచారణకు ఇంతవరకు ఎలాంటి ప్రత్యేక కోర్టులు లేవు. అందుకే 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. మనం పెట్టబోయే ఈ ప్రత్యేక కోర్టులు.. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్ని మాత్రమే విచారించేలా ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ఆ కేసుల విచారణ చాలా వేగంగా జరుగుతుంది. మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, గ్యాంగ్‌ రేప్‌ ఘటనలు, యాసిడ్‌ దాడులు, అమ్మాయిలను వేధించడం, సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు, పోక్సో కింద వచ్చే అన్ని నేరాల విచారణను ఆ కోర్టులు చేపడతాయి. అంతేకాకుండా ఆ కోర్టుల్లో వాళ్లకు సహాయం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాల్ని ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ల్ని కూడా నియమించబోతున్నాం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఆ పోలీసు బృందానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తాం.

21 పనిదినాల్లో మరణశిక్ష  
ఈ కేసుల విచారణకు ఒకవైపు కార్యాచరణ ప్రణాళిక పెడుతూనే, మరోవైపు చట్టంలో మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇలాంటి దారుణమైన నేరాల్లో ఎక్కడైతే కంక్లూజివ్‌ ఎవిడెన్స్‌(నిర్ధారించదగ్గ ఆధారాలు) స్పష్టంగా ఉంటే, వాళ్లకు కచి్చతంగా మరణశిక్ష పడేలా మార్పు తీసుకొస్తున్నాం. ఇందుకోసం ఐపీసీ సెక్షన్‌ 376 లో మార్పులు తీసుకువస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రెండో మార్పు ఏంటంటే.. ఎక్కడైతే దారుణంగా అత్యాచారం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరుకుతారో, ఎక్కడైతే కంక్లూజివ్‌ ఎవిడెన్స్‌ ఉంటుందో.. అక్కడ 21 పని దినాల్లో తీర్పు వచ్చేలా మార్పులు చేస్తున్నాం. ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఏడు పని దినాల్లోనే అన్ని సాక్ష్యాధారాలు సేకరించి, కేసు దర్యాప్తు పూర్తి చేయాలి. ఆ తర్వాత 14 పని దినాల్లో విచారణ పూర్తి చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇలాంటి దారుణమైన నేరాలు చేసి, స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోతే వారికి 21 పని దినాలలోనే మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకువస్తున్నాం. దీని కోసం 1973  సీఆరీ్పసీలో సెక్షన్‌ –173, సెక్షన్‌ –309లో మార్పులు చేస్తున్నాం.   

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే యావజ్జీవమే
అత్యాచారాలు మాత్రమే కాకుండా ఆడవాళ్లు, చిన్న పిల్లల మీద రకరకాలుగా లైంగిక వేధింపులు కూడా చూస్తున్నాం. వాటికి సంబంధించి ‘పోక్సో’ ప్రకారం కనీసం మూడేళ్లు, గరిష్టంగా 7 ఏళ్లు శిక్ష పడుతుంది. ఇవాళ మనం చట్టంలో చేస్తున్న మార్పులతో నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దీని కోసం ఐపీసీలో సెక్షన్‌ –354 (ఎఫ్‌), సెక్షన్‌ –354(జీ)లు చేరుస్తున్నాం. సోషల్‌ మీడియాలో ఇష్టమొచ్చినట్లు ఆడవాళ్ల మీద మారి్ఫంగ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆడవాళ్లను అప్రదిష్టపాలు చేస్తున్నారు.

ఇలాంటి నేరాల నియంత్రణకు ఐపీసీలో సరైన చట్టం లేదు. అందుకే కొత్త చట్టం చేస్తున్నాం. సోషల్‌ మీడియా పోస్టింగ్‌ల ద్వారా ఆడవాళ్లపై దు్రష్పచారం చేస్తే మొదటిసారి 2 ఏళ్లు, మళ్లీ చేస్తే 4 ఏళ్లు జైలు శిక్ష విధించేలా మార్పు తీసుకొస్తున్నాం. అందు కోసం ఐపీసీలో కొత్తగా సెక్షన్‌ –354 (ఈ) చేరుస్తున్నాం. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి డిజిటలైజేషన్‌ లేకపోవడం వల్ల చాలా కేసులు బయటకు తెలియడం లేదు. దాంతో అలాంటి నేరాలకు పాల్పడిన వారి వివరాలు పూర్తిగా డిజిటలైజ్‌ చేసి, ప్రచారం చేస్తాం. ఆ నేరస్తుల గురించి అందరికీ తెలిసేలా చర్యలు చేపడతాం.  

మరో దిశ ఘటన జరిగితే.. ఏంటి పరిస్థితి?
‘దిశ’ కేసు అనంతరం తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును ఎవ్వరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తమ పిల్లల భద్రతకు భరోసా కలి్పంచేలా తల్లిదండ్రులకు నమ్మకం వచ్చేలా నాలుగడుగులు ముందుకేసి వారు చేయాల్సింది చేశారు. అయితే జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ చేసింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఏర్పాటు చేశారు. ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చంపడం తప్పయినా.. మీరు కూడా తుపాకీతో కాల్చడం తప్పే అని వీళ్లు నిర్ధారిస్తారు.

దాని పర్యవసానంగా... అలాంటి పరిస్థితుల్లో బాధ్యత కలిగిన పోలీసు అధికారి ఇకపై ఏం చేస్తారు? బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది?.. ఇక నుంచి చూసీ చూడనట్లు వదిలేస్తారు. ఏ రాష్ట్రంలో ఎవరూ కూడా, ఇలాంటి ఘటనే జరిగితే, మరో దిశ లాంటి సంఘటన చోటుచేసుకుంటే.. మన పిల్లల్లో ఎవరినైనా దారుణంగా అత్యాచారం చేసి చంపేసినా.. దోషులను శిక్షించాలంటే ఏ పోలీసు అధికారీ ముందుకు రాడు. శిక్షించేందుకు ఏ ప్రభుత్వ పెద్ద కూడా ముందుకు రారు. అప్పుడు దారుణమైన నేరాలు చేసిన వాళ్లు యథేచ్ఛగా బయటకు వస్తారు. శిక్ష పడదు. ఆ ఘటనతో బాధిత కుటుంబం మాత్రం రోదిస్తూనే ఉంటుంది.   

జాతీయ స్థాయిలో దిశ చట్టంపై ప్రచారం రావాలనే..
ఇవాళ మనం చేస్తున్న ఈ చట్టం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోకి వస్తుంది. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఉమ్మడి అంశంపై మనం చట్టం చేస్తే వచ్చే మార్పేమిటంటే.. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఎప్పుడైతే ఇది రాష్ట్రపతి వద్దకు పోతుందో.. ఈ చట్టానికి జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలా చర్చ జరిగినప్పుడు ఆమోదం కూడా వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. మనం రెండు చట్టాలు తీసుకువచ్చాం. ఒక చట్టం రాష్ట్రపతి దగ్గరకు పోవాల్సిన పని లేదు. ఆ చట్టం ఇక్కడే పాస్‌ అవుతుంది. రెండో చట్టం రాష్ట్రపతి ఆమోదానికి పోతుంది. అందుకే రెండు చట్టాలు తీసుకువచ్చాం.   

►గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై ఎక్కువగా నేరాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే, అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే అయినా, పరిస్థితి మార్చాలనుకున్నాం. అందుకోసం విప్లవాత్మక నిర్ణయాలు, చర్యలకు శ్రీకారం చుట్టాం.  

►ఏడేళ్ల క్రితం నిర్భయ ఘటన జరిగినప్పుడు ‘నిర్భయ’ పేరిట ఏకంగా ఒక చట్టమే తీసుకువచ్చాం. ఆ చట్టం తీసుకొచి్చన తర్వాత కూడా ఏమైంది? ఏడేళ్లు దాటినా కూడా, అంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసినా కూడా, వాళ్లకు ఎలాంటి శిక్ష పడని పరిస్థితి. అలాంటప్పుడు దేశంలో ఉన్న ఈ న్యాయవ్యవస్థ మీద ఎవరికైనా, ఎక్కడైనా నమ్మకం ఎలా వస్తుంది?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top