‘చంద్రబాబు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు’

AP Capital Farmer Gadde Meera Prasad Slams Chandrababu Govt Over Land Pooling - Sakshi

రాజధాని రైతు మీరా ప్రసాద్‌ ఆవేదన

సాక్షి, విజయవాడ : ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో చంద్రబాబు.. తనలాంటి ఎంతో మంది రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని రాజధాని రైతు మీరా ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 33 ఎకరాల భూమి ఉందని... అయితే పాస్‌బుక్కులు మార్చి తనను రకరకాలుగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లుగా తన భూమిని కాపాడుకోవడం రాత్రిళ్లు కూడా చేనులోనే పడుకుంటున్నానని తన పరిస్థితి గురించి వివరించారు. కొందరు అధికారులు లంచాలు తిని రికార్డులు తారుమారు చేసి తనను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కోర్టు ఆర్డర్‌ ఉందని చెప్పినా తన మాట వినకుండా దౌర్జన్యం చేస్తూ దుర్మారంగా వ్యవహరించారని ఆవేదన చెందారు.

కాగా రాజధానికి భూమి ఇవ్వని గద్దె మీరా ప్రసాద్‌ అనే రైతు పొలంలో రోడ్డు వేసేందుకు అధికారులు శనివారం ప్రయత్నించగా అందుకు అతడు అడ్డుకోవడంతో పోలీసుల దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే. రైతును బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ పెనుగలాటలో మీరా ప్రసాద్‌ కిందపడిపోయి అస్వస్థతకు గురయ్యారు. అయినా నిర్దయగా వ్యవహరించిన పోలీసులు... అలాగే ఆయన్ని పట్టుకుని వ్యాన్‌ ఎక్కించారు. అంతేకాకుండా మీరా ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన మీరా ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘నేను రాజధానికి భూమి ఇవ్వకపోయినా అధికారులు ఈరోజు నాపై దౌర్జన్యం చేసి...నా పొలంలో రోడ్డు వేశారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకున‍్నందుకు పోలీసులు నాపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఏమీ చేసినా నేను భయపడను. ఇవాళ పోలీసులు నాపట్ల అత‍్యంత దారుణంగా వ్యవహరించారు. నా అనుమతి లేకుండా పొలంలో రోడ్డు వేస్తూ నాపై దురుసుగా ప్రవర్తించారు. అధికారుల తీరుతో పాటు, నా మీద పెట్టిన అక్రమ కేసుపై కోర్టుకు వెళతాను. ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం. నాలుగేళ్ల నుంచి  నా భూమిని కాపలా కాస్తూ కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇవాళ దౌర్జన్యం చేసి పొలంలో రోడ్డు వేశారు. దీనిపై పోరాటం చేస్తా. వదిలిపెట్టను. నన్ను ఎన్నిరోజులు జైల్లో పెడతారు. మళ్లీ బెయిల్ మీద విడుదల అవుతా. పోరాటం చేస్తాను. నా పొలాన్ని నేను దక్కించుకుంటా. ఎన్నికలు అయ్యేవరకూ ఉండి...ఇప్పుడు మళ్లీ నాటకాలు వేస్తున్నారు.’ అంటూ మీరా ప్రసాద్ మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top