అసెంబ్లీ డెన్.. చంద్రబాబు డాన్


 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) :లక్షలాది మంది ప్రజలచేత నేరుగా ఎన్నుకోబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం పనిచేయడానికి ఉద్దేశించిన శాసనసభను టీడీపీ నాయకులు ఒక డెన్‌గా భావిస్తున్నారని, తమ నాయకుడు చంద్రబాబును డాన్ గాను, తమను తాము గూండాల్లాను భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. బుధవారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు చేసిన వీరంగంపై ప్రజలు ముక్కున వేలేసుకుని చూశారన్నారు. వ్యక్తిగత దూషణలతో ప్రారంభమైన వారి దాష్టీకం అసెంబ్లీలో పాతేస్తా అనే వరకూ బరితెగించడాన్ని చూసి అందరూ అవాక్కయ్యారన్నారు. పోలవరం ప్రాజెక్టును విస్మరించి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకురావలసిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రశ్నించిన తమ నాయకుడు జగన్‌మోహనరెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. తమ చేతకానితనాన్ని, అక్కసును ఈ విధంగా వెళ్లగక్కుతున్న చంద్రబాబు ఎప్పటికైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. రుణమాఫీ విషయంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, వారిని తనవైపు తిప్పుకోలేకపోయిన చంద్రబాబు జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగి పబ్బం గడుపుకోవడానికి చూడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీ తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్ష నేతలపై ఎదురుదాడి కి దిగుతున్నట్టు ప్రజలకు అర్థమౌతోందన్నారు.

 

 ప్రతిపక్షం నోరు నొక్కే ప్రయత్నం

 ప్రభుత్వం ప్రతిపక్షం నోరు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. సభలో వ్యక్తిగత దూషణలకు దిగడం హేయం. పోలవరంను పక్కనపెట్టి జిల్లా రైతులకు అన్యాయం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. 15మంది ఎమ్మెల్యేలనిచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడం ఇలాగేనా.

 - వంకా రవీంద్ర, వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్

 

 చూస్తూ ఊరుకోం

 తమ సభ్యులు గూండాల్లానే వ్యవహరిస్తారని చెప్పకనే చెప్పడం ఒక ప్రభుత్వాధినేతకు తగదు. ప్రతిపక్షం ప్రజాసమస్యలను ప్రస్తావిస్తే దానికి సమాధానం చెప్పాల్సిందిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం సభా మర్యాద కాదు. బలం ఉందికదా అని ఏమైనా చేయొచ్చనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.

 - పుప్పాల వాసుబాబు, వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్

 

 కప్పిపుచ్చుకోవడానికే

 చంద్రబాబునాయుడు రైతు, డ్వాక్రా రుణమాఫీని అమలు చేయడంలో విఫలమవడాన్ని కప్పిపుచ్చుకోవడానికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకువ చ్చారు. ఈ అంశంలో జిల్లా ప్రజలను మోసం చేస్తున్నట్టు దొరికిపోయిన చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారు.

 - పోల్నాటి బాబ్జి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి

 

 బాధ్యతలు మర్చిపోతున్నాడు

 చంద్రబాబు తనకు ప్రజలు కట్టబెట్టిన బాధ్యతలను మర్చిపోతున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రతిపక్షంపై ఉసిగొల్పుతున్నాడు. ఇలాగే కొనసాగితే ప్రజావ్యతిరేకత చవిచూడాల్సి వస్తుంది.  

 - కారుమంచి రమేష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top