ఆసుపత్రికి సుమతి..

Andhra Pradesh Govt Helped to Palamaner Boy and His Mother - Sakshi

‘సాక్షి’ కథనానికి స్పందించిన సర్కారు

సీఎం కార్యాలయ ఆదేశాలతో బాధితురాలి ఇంటికి అధికారులు

వైద్యుల సూచనల మేరకు తదుపరి చర్యలు

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌కు నివేదిక

సీఎం సహాయ నిధి ద్వారా సాయం: ఎమ్మెల్యే వెంకటేగౌడ

పలమనేరు (చిత్తూరు జిల్లా): క్యాన్సర్‌ బారిన పడి మంచానికే పరిమితమైన తల్లిని కాపాడుకునేందుకు చిన్నారి కొడుకు పడుతున్న కష్టాలపై ‘సాక్షి’ దినపత్రికలో ‘అమ్మకు ప్రేమతో..’ శీర్షికన శుక్రవారం వచ్చిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాలతో పలమనేరు మున్సిపల్‌ కమిషనర్‌ విజయసింహా రెడ్డి తన సిబ్బంది, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు బాధితురాలు సుమతి ఇంటికి వెళ్లారు. ఆరోగ్య వైద్యశాఖ సిబ్బంది, ఆరోగ్యమిత్ర ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్య సేవలందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. సుమతి సమస్య, ఆమెకు వైద్యం ఎలా అందించాలి, ఆమె కుమారుడు పవన్‌ కుమార్‌ను ఎలా చదివించాలి.. తదితరాలపై నివేదికను రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌కు పంపినట్లు ఆయన తెలిపారు.

దేశ విదేశాల నుంచి స్పందిస్తున్న దాతలు
ఇదిలా ఉంటే.. సుమతి పరిస్థితి తెలుసుకుని ఆదుకుంటామని.. ఆమె కుమారుడ్ని చదివిస్తామని ప్రవాస భారతీయులు అనేకమంది ముందుకు వస్తున్నారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన ఎన్‌ఆర్‌ఐ తిరుమలరెడ్డి జోజిరెడ్డి వారి ఆకలి తీర్చేందుకు తక్షణ సాయంగా రూ.5 వేలను హైదరాబాద్‌లోని తమ బంధువుల ద్వారా మున్సిపల్‌ కమిషనర్‌కు అందించారు. మరింత సాయమందిస్తామని జోజిరెడ్డి అక్కడ నుంచి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఇంకో ఐటీ ఉద్యోగి కూడా సాయం అందించారు.

ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తాం
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమతి పరిస్థితిపై స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాసులు చిత్తూరు కలెక్టర్‌ నారాయణ్‌ భరత్‌గుప్త ఆదేశాలతో విచారణ జరిపారు. ఆమెకు వైద్య సౌకర్యంతోపాటు ఉండేందుకు పక్కా ఇల్లు, రేషన్‌కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం వీఆర్వోలతో కలిసి రూ.5 వేల నగదు, దుప్పట్లు, పండ్లను ఆమెకు అందజేశారు. దాతలెవరైనా వీరికి సాయం చేయాలనుకుంటే.. పి.సుమతి,  W/O శ్రీనివాసులు, ఆంధ్రా బ్యాంకు ఖాతా నంబరు : 181810100022142 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ :  ANDB00011408కు జమచేయవచ్చునని తెలిపారు. మరోవైపు.. సుమతికి సీఎం సహాయ నిధి ద్వారా వైద్యసాయం అందించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top