ఇక సర్కారీ ‘కిక్’ | andhra pradesh government to launch liquor business | Sakshi
Sakshi News home page

ఇక సర్కారీ ‘కిక్’

Feb 11 2015 1:46 AM | Updated on Sep 2 2017 9:06 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మద్యం వ్యాపారంలోకి దిగనుంది. తమిళనాడు తరహాలో మద్యం విక్రయాలు చేపట్టనుంది.

మద్యం వ్యాపారంలోకి రాష్ట్ర ప్రభుత్వం
భారీ ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం
వచ్చే జూలై నుంచి కొత్త ఎకై్సజ్ విధానం: యనమల
తమిళనాడు తరహాలో విక్రయాలు


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మద్యం వ్యాపారంలోకి దిగనుంది. తమిళనాడు తరహాలో మద్యం విక్రయాలు చేపట్టనుంది. ఇందుకోసం కమీషన్ విధానాన్ని అవలంభించనుంది. రేషన్ షాపుల తరహాలో ఒక్కో మద్యం దుకాణంలో ఇద్దరేసి డీలర్లను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు. ఆ డీలర్లు మద్యం విక్రయిస్తారు. ఇందుకోసం వారికి కమీషన్ చెల్లిస్తారు. అంటే ఎంత ఎక్కువ మద్యం విక్రయిస్తే అంత ఎక్కువ కమీషన్ డీలర్లకు వస్తుంది. బీమా ఏజెంట్లకు ఎలాగైతే ఎంత ఎక్కువ మందితో ఇన్సూరెన్స్ చేయిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుందో.. ఆ తరహాలోనే వీరికి కూడా విక్రయించిన మద్యం మేరకు కమీషన్ లభిస్తుందన్నమాట.

తమిళనాడులో మద్యం దుకాణానికి అనుబంధంగా బార్లు కూడా ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో కూడా అదే విధానం అమల్లోకి రానుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి తమిళనాడు తరహా నూతన ఎకై్సజ్ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తనను కలిసిన విలేకరులతో చెప్పారు.పస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.3,738 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా జనవరి నాటికి రూ.2,998 కోట్ల ఆదాయం వచ్చింది.

వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్
ఇలా ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రాథమిక మిషన్‌లోని రంగాలపై సమీక్షలు పూర్తి అయినట్లు యనమల చెప్పారు. ‘వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు వ్యవసాయ పెట్టుబడి వీలైనంత తక్కువగా ఉండేలాగ చర్యలు చేపట్టనున్నాం. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. సాగునీటి రంగంపై బడ్జెట్ సమీక్ష పూర్తి అయ్యింది. ప్రస్తుతం నీటి తీరువాను రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఇకపై సాగునీటి వినియోగ సంఘాల ద్వారా వసూలు చేయించాలని నిర్ణయించాం.

సాగునీటి శాఖలో లష్కర్ల కొరత ఉండటంతో ఔట్ సోర్సింగ్ విధానంలో వారిని నియమించేందుకు ఆమోదం తెలిపాం. అదనపు ఆదాయ వనరుల సమీకరణకు ప్రస్తుతానికి గనులు, అటవీ రంగాలపై దృష్టి సారించాం. గతంలో మంజూరు చేసి.. నిలిపివేసిన సీఎం ప్రత్యేక నిధి పనుల్లో రూ.180 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం.14వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు వస్తాయని ఆశిస్తున్నాం..’ అని మంత్రి చెప్పారు.

అధికారికంగా బెల్ట్‌షాపులు
చంద్రబాబునాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బెల్ట్‌షాపుల విధానానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 10వేల బెల్ట్ షాపులు నడిచాయి.అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను ఎత్తేస్తామని చెప్పిన బాబు  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  నెపంతో అధికారికంగా మద్యం షాపులను తెరవడానికి రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వమే అధికారికం గా బెల్ట్ షాపులను నిర్వహించడమేనని అధికారుల మాట.

Advertisement
 
Advertisement
Advertisement