
ములకలచెరువు/మదనపల్లె/గన్నవరం/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో ప్రధాన నిందితుడు కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌లో కూలీలను సమకూర్చడంతోపాటు నకిలీ మద్యం రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సీఐ హిమబిందు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని వేరుగా అరెస్ట్ చేశారు.
ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా తేలిన వారి సంఖ్య 14 మంది. తొలిరోజు 10 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన నలుగురిలో కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేశారు. కొడాలి శ్రీనివాసరావు, జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, విదేశాల్లో ఉన్న జనార్దనరావు అరెస్ట్ కావాల్సి ఉంది. కాగా.. ఇదే కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చబోతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఆ ఏడుగురు ఎవరన్నది చర్చనీయాంశమైంది. కాగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన కల్తీ మద్యం తయారీ కేసులో మద్యం నింపేందుకు ఖాళీ బాటిళ్లను సరఫరా చేసిన సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్‌కు చెందిన శ్రీనివాసరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం నింపేందుకు వినియోగించిన 90 ఎంఎల్ (క్వార్టర్) ఖాళీ బాటిళ్లను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లోని శ్రీనివాస పెట్ బాటిల్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మంగళవారం ఆ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు కంపెనీ నిర్వాహకుడైన గుంటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులకు 17 వరకు రిమాండ్
ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసిన ముగ్గురికి కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జగన్‌మోహన్‌రావు, బాధల్ దాస్, ప్రతాప్‌దాస్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంగళవారం 6వ ఎంఎం ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా, ముగ్గురికీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అధికార పార్టీ నేతల్ని వదిలేసి.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు
మదనపల్లె: అధికార పార్టీ పెద్దల అండదండలతో సాగిన నకిలీ మద్యం దందాలో అసలైన సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి ఎక్సైజ్ అధికారిపై వేటు వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ దందా నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ హిమబిందును విజయవాడ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఎక్కడో అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తుంటేనే దాడులు చేసే ఎక్సైజ్ అధికారులకు ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గురించి తెలియక పోవడం విడ్డూరం అని ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఐపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అందరిపై అన్ని విధాలా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం, బెల్డ్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు.. ఇలా ఇన్ని జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలుపుతోంది.