నర్సంపేట, సూర్యాపేటలో దంపతులకు చెరో దుకాణం..
నడికూడలో ఒకరికి ‘14 గ్రామాల వైన్‌షాపు’
తిరుమలగిరిలో ఒకే కుటుంబంలో ముగ్గురికి..
మహబూబ్‌నగర్‌లో ఓ ప్రభుత్వ టీచర్‌కు కూడా..
సాక్షి, హైదరాబాద్,సూర్యాపేట టౌన్: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రాజేశ్వర్‌రావు, సాంబలక్ష్మి దంపతులు ఈసారి మద్యం దుకాణాల్లో జాక్‌పాట్ కొట్టారు. లక్కీడ్రాలో రాజేశ్వర్‌రావు, సాంబ లక్ష్మిలకు చెరో దుకాణం మంజూరైంది. 25 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉంటున్న వీరు ఈసారి కూడా టెండర్లు దాఖలు చేశారు. జి.సాంబలక్ష్మి నర్సంపేట –5 నంబర్ దుకాణం దక్కించుకోగా భర్త జి.రాజేశ్వర్‌రావు ఆత్మకూర్–38 షాపు లాటరీ డ్రాలో విజేతగా నిలిచాడు. కాగా, రెండు షాపులు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని భార్యాభర్తలు తెలిపారు.
వందలో ఒక్కడు..
హనుమకొండ జిల్లా నడికూడ మండల పరిధిలోని 14 గ్రామాలకు కలిపి ఒకే వైన్‌షాపు ఉంది. ఈ దుకాణానికి 100 అప్లికేషన్లు వచ్చాయి. సోమవారం లాటరీ పద్ధతిలో డ్రా తీయగా 100 అప్లికేషన్ల నుంచి జి.రమణారెడ్డి అనే వ్యక్తికి లక్కు తగిలింది. వందలో ఒక్కడు అంటూ ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
భార్యాభర్తలను వరించిన అదృష్టం
మద్యం దుకాణాల టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్, ఆయన భార్య శ్రావణి సూర్యాపేట పట్టణంలో చెరో మద్యం షాపును దక్కించుకున్నారు.
ఒకే ఇంట్లో ముగ్గురికి..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురికి మద్యం దుకాణాలు దక్కాయి. మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గిలకత్తుల ఉప్పల మల్లయ్యకు సూర్యాపేటలో, ఆయన కుమారుడు నవీన్‌కు మద్దిరాలలో, కోడలు సృజనకు తిరుమలగిరిలోని వైన్ షాపులు డ్రాలో వచ్చాయి. ఉప్పల మల్లయ్య కొన్ని సంవత్సరాలుగా మద్యం వ్యాపారంలోనే ఉన్నారు.
2,601 మద్యం దుకాణాల డ్రా...
తెలంగాణలో రెండేళ్లపాటు మద్యం దుకాణాలు నడుపుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీశారు. మొత్తం 2,620 దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. కాగా అందులో 2,601 దుకాణాలకు డ్రా తీసి గెలుపొందిన వారికి అనుమతినిచ్చారు. డ్రా సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. 2,620 దుకాణాలకు మొత్తం 95,137 దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు ఫీజు కింద రూ.3 లక్షల లెక్కన రూ. 28.54 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు జరుగకుండా డ్రా ప్రక్రియ ముగియడంపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ యంత్రాంగాన్ని అభినందించారు. కాగా, మిగిలిన 19 మద్యం దుకాణాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నవంబర్ 1 వరకు మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ, నవంబర్ 3న 19 మద్యం షాపులకు డ్రా తీయనున్నట్లు ఎౖMð్సజ్ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ప్రభుత్వ టీచర్‌కుమద్యం దుకాణం.. విచారణ చేస్తామన్న డీఈఓ
మహబూబ్‌నగర్ క్రైం: మద్యం దుకాణాల కేటాయింపు లక్కీడిప్‌లో ఓ ప్రభుత్వ టీచర్‌కు మద్యం దుకాణం దక్కింది. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేందిర బోయి ఆధ్వర్యంలో ఏ4 మద్యం దుకాణాలకు లక్కీడిప్ నిర్వహించారు. ఇందులో గెజిట్ నంబర్ 16వ దుకాణానికి లక్కీడిప్ తీసిన క్రమంలో 17వ టోకెన్ నంబర్ కలిగిన బి.పుష్ప అనే ప్రభుత్వ పీఈటీ ఉపాధ్యాయురాలికి దుకాణం వచ్చింది. ఆమె ప్రస్తుతం జిల్లాకేంద్రంలోని రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా, సీసీఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారాలు చేయరాదని, ఒకవేళ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తామని డీఈఓ తెలిపారు.


