అంతర్రాష్ట్ర సర్వీసులు షురూ!

Andhra Pradesh Government Requests Other State To Start Interstate Services - Sakshi

తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలకు సీఎస్‌ లేఖ

కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ 

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 

► తెలంగాణ నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో పెద్ద సంఖ్యలో వస్తున్న వారికి రాష్ట్ర సరిహద్దులో తనిఖీలు, స్క్రీనింగ్‌ చేసి, వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ వివరాల సేకరణ ప్రస్తుతం సమస్యగా మారింది.

► ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వారి వివరాలు సేకరించడం కష్టంగా ఉందని, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  

► లాక్‌డౌన్‌–4 నిబంధనల మినహాయింపు తర్వాత తెలంగాణ నుంచి 13 వేల మంది ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం బస్సులు తిప్పడానికి అప్పట్లో ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రయత్నించగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు అంతర్రాష్ట్ర ప్రయాణికులను తెలంగాణ అనుమతిస్తున్నా.. ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు.

► కాగా, తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ప్రభుత్వాలకు ఏపీ లేఖలు రాసింది. 

► ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణపై మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. (ఏపీఎస్‌ఆర్టీసీ మరో నిర్ణయం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top