సీఐ మృతి.. ఎంపీ గోరంట్ల మాధవ్‌ దిగ్భ్రాంతి  

Anantapur Traffic CI Expire With Corona - Sakshi

సాక్షి, అనంతపురం/ కర్నూలు: అనంతపురం ట్రాఫిక్‌ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌ (47) కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు. ఈయన కొన్నేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కర్నూలు దాటిన తరువాత పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజశేఖర్‌ కుటుంబసభ్యులు కర్నూలులోని రామలింగేశ్వర నగర్‌ రోడ్‌నెంబర్‌ 5లో నివాసముంటున్నారు. ఆత్మకూరు మండలం కృష్ణాపురం స్వగ్రామం. తండ్రి శ్రీరాములు కో–ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు.

అప్పటి నుంచి వీరు కర్నూలులోనే నివాసముంటున్నారు. శ్రీరాములుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. రెండవ కుమారుడైన రాజశేఖర్‌ 1995లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ఎక్కువ కాలం అనంతపురం జిల్లాలోనే విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తరువాత కొంతకాలం కర్నూలు సీసీఎస్‌లో కూడా విధులు నిర్వహించారు. ఈయనకు భార్య శిరీషతో పాటు బీటెక్‌ చదువుతున్న కుమారుడు ఉన్నాడు. మొన్నటివరకు విధుల్లో పాల్గొంటూ అందరితో కలిసి ఉన్న సీఐ రాజశేఖర్‌ ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి మృతి చెందడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ సీఐ రాజశేఖర్‌ మృతిపై కలెక్టర్‌ గంధం చంద్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన  మృతికి సంతాపం తెలియజేశారు. సమర్థవంతుడైన సీఐ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.  

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక‍్తం చేసిన ఎంపీ గోరంట్ల
రాజశేఖర్‌ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలికుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 

రాజశేఖర్‌ మృతికి ఎమ్మెల్యే అనంత సంతాపం 
అనంతపురం సెంట్రల్‌: సీఐ రాజశేఖర్‌ మృతి పోలీసు శాఖకు తీరని లోటని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనేక సంవత్సరాలుగా వివిధ హాదాల్లో సమర్థవంతంగా పనిచేశారన్నారు. కరోనా కష్టకాలంలోనూ మూడు నెలలుగా ప్రజలను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేసిన అధికారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top