అమాత్యా..ఇదేందయ్యా! | Amatyaidendayya! | Sakshi
Sakshi News home page

అమాత్యా..ఇదేందయ్యా!

Jan 24 2015 1:57 AM | Updated on Oct 1 2018 2:00 PM

అమాత్యా..ఇదేందయ్యా! - Sakshi

అమాత్యా..ఇదేందయ్యా!

రైతులకు మళ్లీ యూరియా కష్టాలు తప్పటం లేదు. నిన్నమొన్నటి వరకు ఖరీఫ్ సాగులో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడిన రైతులకు రబీలోనూ అదే పరిస్థితి ఎదురైంది.

రేపల్లె : రైతులకు మళ్లీ యూరియా కష్టాలు తప్పటం లేదు. నిన్నమొన్నటి వరకు ఖరీఫ్ సాగులో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడిన రైతులకు రబీలోనూ అదే పరిస్థితి ఎదురైంది. రోజల తరబడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల చుట్టూ తిరిగినా బస్తా యూరియా లభించడం కష్టమవుతోంది.

సొసైటీలకు వస్తున్న యూరియా పాలకుల సిఫార్సులతో అడ్డదారిలో వెళ్లిపోతోంది. క్యూలో ఉంటున్న రైతులకు చివరకు కాళ్లతీతలే మిగులుతున్నాయి. ఇసుకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద వారం రోజలుగా యూరియా కోసం రైతులు బారులు తీరుతూనే ఉన్నారు.
 
మినుముకు వైరస్ సోకి పంట దెబ్బతింటుండటంతో రబీలో మొక్కజొన్న, తెల్లజొన్న సాగు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు.
 
ఈ ఏడాది రేపల్లె వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని రేపల్లె, భట్టిప్రోలు, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల పరిధిలో మొక్కజొన్న, తెల్లజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. 10,500 హెక్టార్లలో మొక్కజొన్న, 600 హెక్టార్లలో తెల్లజొన్న సాగు చేస్తున్నారు.
 
ప్రస్తుతం యూరియా అందిస్తేనే ముందు ముందు దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. దీంతో రైతులు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. ధర గిట్టుబాటు కావటం లేదని ప్రైవేట్ వ్యాపారులు యూరియా అమ్మకాలను నిలిపివేశారు. దీంతో రైతులంతా యూరియా కోసం వ్యవసాయ సొసైటీలు, మార్కెట్ యార్డులను ఆశ్రయిస్తున్నారు.
 
ఖరీఫ్ సాగులో రైతులు యూరియా కోసం ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రబీకి అవసరమైన ఎరువును సకాలంలో అందించటంలో చొరవ చూపాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
 
సాగు అదనులో ఎరువులు అందించలేకపోతే ఆ ప్రభావం దిగుబడిపై చూపి రైతులు నష్టపోతారని తెలిసినా పాలకుల్లో చలనం కనిపించటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement