
కంది పంట సాగులో పెద్ద ముందడుగు పడింది. ఇప్పటి వరకు కంది అంటే కేవలం వర్షాకాలంలో విత్తుకునే ఖరీఫ్ పంట మాత్రమే. ఇక మీదట ఏడాదికి 3 సార్లు విత్తుకోదగిన కంది పొట్టి రకం అందుబాటులోకి వచ్చింది. 45 డిగ్రీల అధిక వేడిని కూడా తట్టుకుంటూ హెక్టారుకు 2 టన్నుల వరకు దిగుబడినిచ్చే కంది వంగడాన్ని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) శాస్త్రవేత్తలు రూపొందించారు. సీనియర్ బ్రీడర్ డా. గంగశెట్టి ప్రకాశ్ సారధ్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోనే తొలిసారి స్పీడ్ బ్రీడింగ్, స్పీడ్ చిప్పింగ్ పద్ధతుల్లో కంది వంగడాన్ని వెలువరించారు. అధిక వేడిని తట్టుకోగల 125 రోజుల్లో కోతకొచ్చే ఐసిపివి 25444 వంగడంతో 3 సీజన్లలోనూ కందులు పండించవచ్చని ఇక్రిశాట్ చెబుతోంది.
వచ్చే జనవరిలో..
ఐసిపివి 25444 రకం కంది పంటను ఇక్రిశాట్ పొలంలో గత ఫిబ్రవరిలో విత్తాం. ఇప్పుడు కోతకొచ్చింది. ఈ రకాన్ని ఏ సీజన్‌లోనైనా సాగు చేయవచ్చు. ఖరీఫ్‌లో వరి సాగు చేసిన భూముల్లో రబీలో ఈ కంది రకాన్ని సాగు చేయొచ్చు. ఖరీఫ్, రబీల్లో వరుసగా వరి సాగు చేసే భూముల్లో.. వేసవిలో వేయొచ్చు. మొక్కజొన్న / కూరగాయలు సాగు చేసే భూముల్లో రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. కొందరు రైతులకు 2026 జనవరిలో విత్తనాలు ఇస్తాం. వాణిజ్య పరంగా విత్తనాలు
అందుబాటులోకి రావటానికి మరో 1.5 ఏళ్లు సమయం పడుతుంది. ఇది జన్యు సవరణ వంగడం కాదు.
– డా. గంగశెట్టి ప్రకాశ్, సీనియర్ శాస్త్రవేత్త, కంది బ్రీడింగ్ విభాగం, ఇక్రిశాట్