రెండో పంటకు నీరు లేనట్లే! | Crop cultivation was not possible in Rabi under the Tungabhadra Lower Canal | Sakshi
Sakshi News home page

రెండో పంటకు నీరు లేనట్లే!

Nov 3 2025 4:21 AM | Updated on Nov 3 2025 4:21 AM

Crop cultivation was not possible in Rabi under the Tungabhadra Lower Canal

రబీ ఆశలపై నీళ్లు!

గతేడాది ఆగస్టులో కొట్టుకుపోయిన టీబీ డ్యాం 19వ గేటు 

అలాగే గేట్ల మందం దెబ్బతిన్నట్లు నివేదికలు 

మొత్తం 33 గేట్ల మార్పునకు రూ.52 కోట్లతో అంచనాలు 

16 శాతం లెస్‌కు టెండర్‌ దక్కించుకున్న గుజరాత్‌ సంస్థ 

ఇప్పటివరకు కేవలం 12 గేట్లు సిద్ధం 

ఈ నెల 15 నాటికి మరో 3 గేట్ల తయారీ  

గేట్ల ఏర్పాటు కాకపోవడంతో రబీకి నీటి కష్టాలు 

కర్నూలు సిటీ: భారీ వర్షాలు కురిసి సమృద్ధిగా నీరు ఉన్నా రైతులు రెండో పంట పండించే వీలు లేకుండా పోయింది. గతేడాది ఆగస్టులో టీబీ డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద రబీలో ఆయకట్టు సాగు కాలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. డ్యాంలో 80 టీఎంసీల నీరు ఉండడంతో ఆయకట్టు రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. డ్యాం గేట్ల మార్పుల పనులతో రెండో పంటకు నీరు అందుబాటులో ఉండే పరిస్థితులు అగుపించడం లేదని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు.  

19వ గేటు ఏర్పాటుకు ఆటంకం! 
టీబీ డ్యాం 19వ గేటు గతేడాది ఆగస్టులో కొట్టుకుపోయింది. దాని స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు నిపుణుల కమిటీ సలహా మేరకు రూ.1.98 కోట్లతో  టెండర్‌ పిలిచారు. టెండర్‌ను దక్కించుకున్న గుజరాత్‌ కంపెనీ ఏప్రిల్‌ చివరి వారంలో డిజైన్స్‌ తయారు చేసింది. టీబి బోర్డు ద్వారా ఏపీ సెంట్రల్‌ డిజైన్‌ కమిటీకి పంపించారు. అయితే ఆ డిజైన్‌కు ఆమోదం నెల రోజులు ఆలస్యం కావడంతోనే సకాలంలో గేటు తయారు చేసి బిగించలేకపోవడంతో 105 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు సామర్థ్యాన్ని తగ్గించారు. 

ఏజేన్సీ గేటు తయారు చేసి బిగించేందుకు రెండు నెలల గడువు ఇచ్చారు. గేటును సిద్ధం చేసుకొని డ్యాం దగ్గరకు తీసుకొచ్చింది. అయితే డ్యాం ఎగువన భారీ వర్షాలు కురవడంతో గేటు బిగించేందుకు సాధ్యం కాకపోవడంతో జూన్‌ నెలలో వాయిదా వేశారు. ఈ గేటుతో పాటు మిగిలిన 32 గేట్ల తయారీ టెండర్‌ దక్కించుకున్న గుజరాత్‌ కంపెనీ జూన్‌ నెల నుంచి ఇప్పటి వరకు 12 గేట్లను తయారు చేసింది. ఈ నెల 15వ తేదీలోపు మిగిలిన గేట్లను సిద్దం చేయనున్నట్లు డ్యాం ఇంజినీర్లు చెబుతున్నారు.

3.5 లక్షల ఎకరాల్లో పంటలు లేనట్లే! 
తుంగభద్ర జలాలపై రాయలసీమ జిల్లాల్లో ఎల్‌ఎల్‌సీ, హెచ్చెల్సీ, ఆలూరు బ్రాంచ్‌ కెనాల్, కేసీ కాలువల పరిధిలో 6.56 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రబీ సీజన్‌లో 3.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు కావాలి. అయితే డ్యాం గేట్ల మార్పుతో సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు తగ్గించారు. రబీకి నీరు ఇవ్వమని ఖరీఫ్‌ సీజన్‌కు ముందే బోర్డు ప్రకటించింది. అయితే వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలో నీటి సామర్థ్యం (80 టీఎంసీలకు)తగ్గిపోయింది. 

ఇన్‌ఫ్లో ఉండడంతో రబీ ఆయకట్టుకు కూడా నీరు ఇస్తారని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెలలోపు వర్షాలు నిలిచిపోయే అవకాశాలు ఉండడం, ఉన్న నీటితో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు డిసెంబర్‌ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సి ఉండడంతో రెండో పంటలకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని ఇంజినీర్లు చెబుతున్నారు. రబీలో  ఎల్‌ఎల్‌సీ, హెచ్చెల్సీ, కర్ణాటక సాగు నీటి కాలువకు రోజుకు 0.89 టీఎంసీలు, నెలకు సుమారు 27 టీఎంసీల ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీరు ఇవ్వాలంటే కనీసం 110 టీఎంసీల నీరు అవసరం ఉంది. 

అంత నీటి లభ్యత లేదని, తాగు నీటి అవసరాలు, వేసవిని దృష్టిలో పెట్టుకొని రబీకి నీరు ఇవ్వలేమని ఇంజినీర్లు చెబుతున్నారు.  ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఈ నెల 7న టీబీ బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ తరుపున సభ్యులుగా ఉండే వ్యక్తి ఆ రోజు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 21వ తేదీకి సమావే«శం వాయిదా వేసినట్లు తెలుస్తుంది. 

‘సుంకేసుల’పై నిర్లక్ష్యం 
ఓఅండ్‌ఎం నిధుల మంజూరులో జాప్యం 
రూ.52 లక్షల బిల్లులు పెండింగ్‌ 
ఉమ్మడి కర్నూలు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలకు సాగు, తాగు నీటిని అందిండంలో కీలకమైనా సుంకేసుల బ్యారేజీ గేట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో లీకేజీలు అవుతున్నాయి. బ్యారేజీకి స్పిల్‌వేకు 30 క్రస్టు గేట్లు ఉన్నాయి. ఓక్కో గేటు 18 మీటర్లు పొడవు, 7 మీటర్లు వెడల్పు ఉన్నాయి. ఈ గేట్ల నుంచి 5.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయవచ్చు. అదే విధంగా స్కవరింగ్‌ స్లూయిజ్‌కు నాలుగు వర్టికల్‌ గేట్లు ఉన్నాయి. కేసీ కాలువకు నీటి విడుదలకు నాలుగు వర్టికల్‌ గేట్లు ఉన్నాయి.

మొత్తం 38 గేట్లను రూ.140 కోట్లతో రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి వరకు బ్యారేజీలో నీరు అడుగంటలేదు. 2014 తరువాత ఇప్పటి వరకు నాలుగు సార్లు పూర్తిగా ఎండిపోయింది. ఆ సమయంలో బ్యారేజీ గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదు. 

తాగు నీటికి ఇక్కట్లే! 
సుంకేసుల బ్యారేజీ 1.2 టీఎంసీల సామర్థ్యం. ఇందు లో పూర్తి స్థాయిలో నీరు ఉంటేనే కర్నూలు నగర ప్రజలకు తాగు నీటి అవసరాలు తీరేది. ఈ ఏడాది సీజన్‌ మొదలయ్యాక బ్యారేజీ నిర్వహణకు కొంత నిధులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఎనిమిది గేట్లు రోప్స్‌ తుప్పుపట్టి ఇంజినీర్లను ఇబ్బంది పెట్టాయి. ఈ గేట్లకు రోప్స్‌ మార్చాలని రూ.24 లక్షలతో అంచనాలు వేసి పనులు చేపట్టారు. స్పిల్‌వే గేట్ల రబ్బర్‌ సీల్సు మా ర్చాల్సి ఉందని, పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. 

కేసీ కెనాల్‌ డివిజన్‌ కార్యాలయంలో అప్‌లోడ్‌ చేయకపోవడంతో ఏడాదిన్నరగా రూ.52 లక్షల బిల్లులు రాలేదు. రబ్బర్‌ సీల్సు టెఫ్లాన్‌ కోటింగ్‌ పోయి చాలా గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతోంది. నీరంతా దిగువకుపోతే కర్నూలు నగరవాసులతో పాటు వందలాది గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. 

రబీకి నీరు 
ఇవ్వలేం తుంగభద్ర డ్యాం గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. డ్యాంలో ఉండే 80 టీఎంసీల నీటితో రెండో పంటకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. ఖరీఫ్‌కు డిసెంబర్‌ వరకు నీరు ఇవ్వాల్సి ఉంది. రబీకి నెలకు 27 టీఎంసీల నీరు ఇవ్వాలి. డ్యాంలో నీరు లేదనందున రబీకి ఇవ్వడం సాధ్యం కాదు.  – జ్ఞానేశ్వర్, టీబీ డ్యాం డీఈఈ 

దెబ్బతిన్న గేట్లు
తుంగభద్ర డ్యాంను సుమారు ఏడు దశబ్దాల క్రితం నిర్మించారు. డ్యాంలో మొత్తం 33 క్రస్టు గేట్లు ఉన్నాయి. నిర్మాణం సమయం నుంచి ఇప్పటి వరకు డ్యాం గేట్ల భద్రతపై దృష్టి సారించలేదు. దీంతో గేట్లన్నీ దెబ్బతిన్నాయి. గతేడాది ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరద నీటి ప్రవాహనికి డ్యాం 19వ క్రస్టు గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు స్థానంలో నాడు తాత్కాలికంగా నిపు ణుల పర్యవేక్షణలో స్టాప్‌లాక్‌ గేటును ఏర్పాటు చేశారు. ఏడాదికిపైగా స్టాప్‌లాక్‌ గేటుతోనే డ్యాం భద్రతను పర్యవేక్షిస్తున్నారు.  

సీడబ్యూసీ మాజీ చైర్మెన్‌ ఏకే బజాజ్, నేషనల్‌ డ్యాం సేఫ్టీ ఆథారిటీ ఆధ్వర్యంలో కమిటీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేశారు. వారు ఇచ్చిన సూచనల ఆధారంగా కేఎస్‌ఎన్‌డీటీ సర్వీసెస్‌ అనే సంస్థతో స్టడీ చేయించారు. ఆ సంస్థ సుమారుగా 15 రకాల పరీక్షలు నిర్వహించి నివేదిక ఇచ్చింది. 

అందులో డ్యాం 33 గేట్లు మార్చాలని, గేట్లలో అత్యధిక శాతం 40 నుంచి 50 శాతం తప్పుపట్టి దెబ్బతిన్నాయని, గడ్డర్లు, సపోరి్టంగ్‌ ప్లేట్లు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో అన్ని గేట్లు మార్చేందుకు రూ. 52 కోట్లతో అంచనాలు వేసి టెండర్లు పిలవ్వగా..గుజరాత్‌ కంపెనీ టెండర్‌ దక్కించుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement