డీఐజీ రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్‌ వేటు | Give Suspension To DIG Ravindranath In Amaravati | Sakshi
Sakshi News home page

డీఐజీ రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్‌ వేటు

Oct 30 2019 4:58 PM | Updated on Oct 30 2019 6:59 PM

Give Suspension To DIG Ravindranath In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ ఏ రవీంద్రనాథ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఏసీబీ కేసు వ్యవహారంలో ఆయన అధికారులతో కుమ్మకైనట్టు రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశంతో రవీంద్రనాథ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ సందర్భంగా పిల్లి సుభాష్‌చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఏసీబీ అధికారులు దారిదోపిడీ దొంగల్లా తయారయ్యారని మండిపడ్డారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కడం దారుణమని అన్నారు. ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఏసీబీ డీజీ, హోం మంత్రితో ఈ అంశంపై మాట్లాడినట్టు తెలిపారు. ఈ కేసు విషయంలో విచారణ అవసరం లేదని.. పూర్తి సాక్ష్యాధారాలున్నాయని ఆయన వెల్లడించారు.

తప్పు చేసిన వారిపై ఎలాంటి కేసులు పెడతారో.. లంచాల కోసం తప్పులు చేసే ఏసీబీ అధికారులపై కూడా అటువంటి కేసులు పెట్టాలన్నారు. తప్పు చేసిన ఏసీబీ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీ నుంచి డైరెక్టుగా రిక్రూట్ అయిన వాళ్లు పారదర్శకంగా వ్యవహరిస్తుంటే.. తమ శాఖకు చెందిన కొందరు అధికారులు కుమ్మక్కై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నామని మంత్రి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement