అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో గుంటూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులపై నగరపాలక కమిషనర్ అనురాధ సస్పెన్షన్ వేటు వేశారు.
గుంటూరు: అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో గుంటూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులపై నగరపాలక కమిషనర్ అనురాధ సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను డిస్మిస్ చేసి, ముగ్గురు పర్యవేక్షణాధికారులకు చార్జి మెమోలు ఇచ్చారు. గుంటూరు కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను చెల్లించిన సుమారు కోటి రూపాయల సొమ్మును అక్రమంగా వాడుకున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ అనురాధ దీనిపై ఇద్దరు ఉన్నతాధికారులతో రహస్య విచారణ జరిపి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కుంభకోణం బయటపడిందిలా..
గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి తమ ఆస్తి పన్ను ఎక్కువగా ఉందని రివిజన్ పిటిషన్ కోసం కార్పొరేషన్‌కు వచ్చారు. అయితే అప్పటి వరకు ఉన్న బకాయిలను చెల్లించాలని సిబ్బంది తెలపడంతో.. అతను పన్ను కట్టిన రశీదులు అందించాడు. దీన్ని ఆన్‌లైన్‌లో చూడగా పన్నులు చెల్లించనట్టు తేలింది. వెంటనే కమిషనర్ అనురాధను కలిసి సదరు వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ.50 లక్షలు, 2014 మార్చి నుంచి ఇప్పటివరకు చూస్తే సుమారు కోటికి పైగా సిబ్బంది నొక్కేసినట్లు తెలిసింది.