సంక్రాంతికి 4,049 ఆర్టీసీ బస్సులు 

4049 RTC buses for Sankranti Festival - Sakshi

హైదరాబాద్‌ నుంచి 2,029..  

ఏపీ నుంచి హైదరాబాద్‌కు 2 వేల బస్సులు తిప్పేందుకు నిర్ణయం 

ఎల్‌బీ నగర్, ఎంజీబీఎస్‌ల వద్ద స్టాప్‌ల ఏర్పాటుకు టీఎస్‌ఆర్టీసీ అంగీకారం 

సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని స్వస్థలాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం.. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలు.. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెగ్యులర్‌ సర్వీసులతో కలిపి మొత్తం 4,029 బస్సుల్ని తిప్పేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 9–15 వరకు వీటిని తిప్పనుంది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు 2,029 ప్రత్యేక బస్సులు.. అలాగే, ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెండు వేల ప్రత్యేక బస్సుల్ని అధికారులు తిప్పనున్నారు. అయితే, హైదరాబాద్‌లో బస్సుల్ని నిలిపి ఉంచేందుకు ఏపీఎస్‌ఆర్టీసీకి స్థల సమస్య ఉండటంతో టీఎస్‌ఆర్టీసీ అధికారులతో ఏపీ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్‌లో ఎల్‌బీ నగర్‌ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్ని నిలిపి ఉంచేందుకు అక్కడ నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. ఫ్లై ఓవర్‌కు ముందు టీఎస్‌ఆర్టీసీ నల్గొండ, ఖమ్మం వెళ్లే బస్సుల కోసం ప్రత్యేక స్టాప్‌ ఏర్పాటుచేసింది. ఫలితంగా విజయవాడ, విశాఖపట్టణం, ఇతర ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు ఎల్‌బీ నగర్‌ వద్ద ఏపీఎస్‌ఆర్టీసీకి స్టాప్‌ లేకుండాపోయింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు టీఎస్‌ఆర్టీసీ అధికారుల సహకారంతో టీఎస్‌ఆర్టీసీ స్టాప్‌ పక్కనే ప్రత్యేకంగా బస్సుల్ని నిలిపి ఉంచుకునేలా ఏర్పాట్లుచేశారు. కర్నూలు, కడప, తిరుపతి, చెన్నై వైపు వెళ్లే బస్సుల కోసం ఎంజీబీఎస్‌ వద్ద స్థలం కేటాయించాలని రాష్ట్ర వినతికి టీఎస్‌ఆర్టీసీ అధికారులు అంగీకరించి సీబీఎస్‌ వద్ద స్టాప్‌ కేటాయించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top