ఐదు రోజులైనా న్యాయం జరగకపోవడంపై ఆర్టీసీ సంఘాల నిరసన
రామచంద్రపురం రూరల్: బస్సు కండక్టర్‌పై దాడి చేసి ఆయన కాలు విరగ్గొట్టిన నిందితులపై ఐదు రోజులైనా చర్యల్లేకపోవడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడ్డాయి. సోమవారం రామచంద్రపురం డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపాయి. బాధిత కండక్టర్ కుక్కల మంగేశ్వరరావుకు న్యాయం చేయాలని డిమాండ్‌చేశాయి. బాధితుడి కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న మంగేశ్వరరావు ఈ నెల 23న కోరుమిల్లి– రాజమండ్రి సరీ్వసులో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కోరుమిల్లికి చెందిన తుట్టపు అన్నపూర్ణ బస్సు ఎక్కి మాచవరం వెళ్లాలని చెప్పారు. అయితే ఆమె సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో చార్జీ చెల్లించాలని మంగేశ్వరరావు స్పష్టం చేశారు.
దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్‌పై దౌర్జన్యం చేసింది. దీంతో కండక్టర్, డ్రైవర్ అన్నపూర్ణను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాలని భావించారు. అయితే తోటి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వివాదాన్ని అంతటితో ముగించారు. బస్సు రాజమండ్రి వెళ్లి తిరిగి కోరుమిల్లి చేరుకున్న సమయంలో అన్నపూర్ణ కుమారుడు భూషణం, అతడి స్నేహితుడు అడ్డాల ఆదినారాయణ బస్సు నుంచి దిగుతున్న కండక్టర్ మంగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఆయన కాలు విరగ్గొట్టారు. స్థానికులు, డ్రైవర్.. కండక్టర్‌ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. దీనిపై అంగర పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినా నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావ డంతో పోలీసులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు.
పైగా, మంగేశ్వరరావుకు మెరుగైన వైద్యం అందించకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకులు జేఏసీగా ఏర్పడి సోమవారం గేట్ మీటింగ్ పెట్టి నిరసన తెలిపారు. బాధిత కండక్టర్ కాలుకు తక్షణం శస్త్రచికిత్స చేయించాలని, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కోలుకునేవరకు ఆన్‌డ్యూటీగా పరిగణించాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కారి్మకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేఎస్‌సీ రావు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ఎల్.నారాయణ, నేషనల్ యూనిటీ అసోసియేషన్ సెక్రటరీ ముత్యాలరావు, వర్కర్స్ యూనియన్ ప్రతినిధి జీఎస్ రాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ పాల్గొన్నారు.


